మెటీరియల్ ‘టెన్’షన్!
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సకాలంలో స్టడీ మెటీరియల్ అందించడంలో జెడ్పీ పాలకవర్గం, అధికార యంత్రాంగం విఫలమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులతో అధిక మార్కుల సాధనకు దోహదం చేసేలా రూపొందించిన మెటీరియల్‌ను విద్యాశాఖాధికారులు గత నవంబర్ 2న జెడ్పీ పాలకవర్గానికి అందజేసినా, ఇప్పటికీ కనీసం ముద్రణకు నోచుకోలేని దుస్థితి నెలకొంది. స్టడీ మెటీరియల్ పంపిణీలో నెలకొన్న జాప్యంపై ఇటు పాలకవర్గం, అటు అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
వైఎస్ జగన్ పాలనలో రెండేళ్లపాటు నిరాటంకంగా..
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో వరుసగా రెండేళ్లు ‘జగనన్న విద్యాజ్యోతి’ పేరుతో స్టడీ మెటీరియల్ రూపొందించి సకాలంలో పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన జెడ్పీ పాలకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో తొలి ఏడాదే చతికిలబడింది. 2022 నవంబరులో రూ.61.80 లక్షల జెడ్పీ నిధులతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 36,155 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. 2023లోనూ రూ.70 లక్షల వ్యయంతో 39వేల మంది విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రస్తుతం టెన్త్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 35వేల మంది విద్యార్థులకు రూ.70 లక్షల ఖర్చుతో స్టడీ మెటీరియల్ పంపిణీకి గత జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనే నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. మార్చి 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ రూపొందించిన మెటీరియల్‌ను నవంబర్ 2న జెడ్పీకి అందించినా టెండర్లను పిలిచి, ముద్రణ చేయించడంలో జెడ్పీ పాలక వర్గం, అధికార యంత్రాంగం విఫలమయ్యాయి.
పదో తరగతి విద్యార్థులకు ఇంకా అందని స్టడీ మెటీరియల్ డిసెంబర్ ముగుస్తున్నా చలనం లేని పాలకులు, అధికారులు 2022లో తొలిసారిగా జగనన్న విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ పంపిణీ ఈసారీ నవంబర్ 2న జెడ్పీకి మెటీరియల్ అందజేసిన విద్యాశాఖ టెండర్ల ఖరారు, ముద్రణలో జెడ్పీ పాలకుల తీవ్ర నిర్లక్ష్యం
గత రెండేళ్లు మెటీరియల్ పంపిణీ ఇలా..
సంవత్సరం అందుకున్న ఖర్చుచేసిన
విద్యార్థులు మొత్తం(రూ.లక్షల్లో)
2022 36,155 61.80
2023 39,000 70.00
విద్యార్థులు నష్టపోతున్నారు
టెన్త్ విద్యార్థులకు డిసెంబర్ 15లోపు స్టడీ మెటీరియల్ ఇస్తామని హామీ ఇచ్చిన జెడ్పీ పాలకవర్గం, అధికారులు ఆచరణలో విఫలమయ్యారు. జనవరిలో ఇచ్చినా, స్టడీ మెటీరియల్ ఆధారంగా పరీక్షలకు సన్నద్ధం కావడం విద్యార్థులకు సాధ్యపడదు. వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చేయాలి.
– కేఎస్ లక్ష్మణరావు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment