పెరిగిన సత్రశాల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన సత్రశాల ఆదాయం

Published Tue, Dec 24 2024 1:50 AM | Last Updated on Tue, Dec 24 2024 1:50 AM

పెరిగిన సత్రశాల ఆదాయం

పెరిగిన సత్రశాల ఆదాయం

రెంటచింతల: మండలంలోని సత్రశాల వద్ద ఉన్న పురాతన గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆదాయం గత ఏడాది కన్నా పెరిగినట్టు దేవదాయ శాఖ సత్తెనపల్లి ఇన్‌స్పెక్టర్‌ వి.లీలావతి, దేవస్థానం ఈఓ గాదె రామిరెడ్డి తెలిపారు. సోమవారం సత్రశాల దేవస్థానంలో హుండీ లెక్కించగా రూ.4,42,500 వచ్చినట్లు వివరించారు. గత ఏడాది రూ.3,69,000 రాగా ప్రస్తుతం రూ.73,500 అధికంగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. స్థానిక శివాలయంలో కార్తీకమాసంలో హుండీ ఆదాయం రూ.11,388 వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో రెంటచింతల శివాలయం చైర్మన్‌ పల్లెర్ల లక్ష్మారెడ్డి, గుండా శివయ్య, మున్నా లింగయ్య, నీలం మల్లయ్య, అర్చకులు పాల్గొన్నారు.

సమగ్రశిక్షలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ అధికారి పోస్టులో ఫారిన్‌ సర్వీసు నిబంధనలపై డెప్యూటేషన్‌పై పని చేసేందుకు ఆసక్తి, అర్హతలు గల ఉపాధ్యాయులు ఈనెల 31లోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ఓప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 55 ఏళ్లలోపు వయసు కలిగిన ఉపాధ్యాయులకు మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో పీజీతోపాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీడీసీఏ, డీసీఏ డిప్లొమా ఉండాలని సూచించారు. విద్యార్హతల జిరాక్స్‌ కాపీలతో ఈనెల 31వ తేదీలోపు డీఈవో కార్యాలయంలోని సమగ్రశిక్ష విభాగంలో సమర్పించాలని, పూర్తి వివరాలకు సమగ్రశిక్షగుంటూరు.బ్లాగ్‌స్పాట్‌.కామ్‌ సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.

యార్డుకు 65,687 బస్తాల మిర్చి

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు సోమవారం 65,687 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 60,866 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 14,800 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 16,000 వరకు లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 49,236 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.

నేడు మున్సిపల్‌ టీచర్స్‌ ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఈవోజీఎన్‌టీ.బ్లాగ్‌స్పాట్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, సర్వీస్‌ రిజిస్టర్‌తో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.

ఉద్యోగాల భర్తీకి

దరఖాస్తులు ఆహ్వానం

గుంటూరు మెడికల్‌: జిల్లాలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. డాట్‌ ప్లస్‌ టీబీ హెచ్‌ఐవీ సూపర్‌వైజర్‌ పోస్టు ఒకటి, టీబీ సెంటర్‌ స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌ పోస్టు ఒకటి, అకౌంటెంట్‌ పోస్టు ఒకటి, టీబీ హెచ్‌డీ ఎన్‌జీఓ పోస్టులు మూడు, డిస్ట్రిక్‌ ప్రొగ్రామ్‌ పోస్టు ఒకటి ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ దరఖాస్తు ఫారం, జీతాలు, ఇతర వివరాలకు గుంటూరు.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. దరఖాస్తులను ఈనెల 24 నుంచి జనవరి 5 వరకు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా టీబీ అధికారిణిని 778058 2555 నంబరులో సంప్రదించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement