భక్తిభావం.. ప్రేమ‘పూర్వ’కం
రోళ్లు సైతం పగిలే ఎండలకు నిలయమైన రెంటచింతల మండే గుండెల్లోనూ ప్రేమ వర్షం కురిపించే క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. పురాతన చలువ రాతి మందిరాల్లో క్రీస్తు చల్లని దీవెనలు నిరంతరం కురుస్తున్నాయి. ఇక్కడ శతాబ్దాల క్రితం నిర్మించిన చర్చిలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఏసు సేవలో తరిస్తున్నాయి. ప్రేమపూర్వక బోధనలతో మార్మోగుతున్నాయి. జయజయ యేసు జయక్రీస్తు అంటూ నినదిస్తున్నాయి.
శతాధిక వసంతాల చర్చిలు కేరాఫ్ రెంటచింతల
రెంటచింతల: క్రిస్మస్ వేడుకలకు మండలంలోని పలు చర్చిలు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతున్నాయి. మండల కేంద్రంలో కొలువైన పురాతన కతోలిక మందిరాలూ క్రిస్మస్ దివ్య వేడుకలకు సిద్ధమయ్యాయి. ఈ ఆలయాలు ఎన్నో విశిష్టతల సమాహారంగా విరాజిల్లుతున్నాయి. 174 ఏళ్ల క్రితం 1850లో నిర్మించిన కానుకమాత చర్చిలో అడుగుపెట్టగానే చలువ రాయి చల్లదనం మనసును మైమరిపింపజేస్తుంది. కానుకమాత దివ్యమంగళ స్వరూప దర్శనంతో మది పులకిస్తుంది. క్రీస్తు శిలువ వేసే సమయంలో పడిన శ్రమలను గుర్తుచేసే 14 ఘట్టాలతో కూడిన రాతి కట్టడాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ చర్చిలో క్రిస్మస్ సందడి నెలకొంది. కానుకమాత చర్చి విచారణ గురువులు ఏరువ లూర్ధుమర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అరుదైన ప్రత్యేకతల నిలయం లూథరన్ చర్చి
121 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన లూథరన్ చర్చి అరుదైన ప్రత్యేకతల నిలయం. చలువ రాతితో నిర్మించిన ఈ మందిరంలో ఎత్తైన 2 టవర్లు ఉన్నాయి. మోగిస్తే 8 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించే 400 కిలోల బరువైన పంచలోహ గంట సందర్శకులను అబ్బురపరుస్తుంది. జర్మనీ దేశం నుంచి తీసుకు వచ్చిన ఏసుక్రీస్తు ప్రతిమలు, పురాతన బాప్టిజం తొట్టె, ఇత్తడి శిలువలు ఆకట్టుకుంటాయి. భక్తిభావాన్ని పెంపొందిస్తాయి. 1903లో జర్మనీ దొర ఆల్‌బర్ట్ జార్జి ఈ ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చి నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు తొమ్మిదేళ్లపాటు నిర్మాణ పనులు జరిగాయి. 1912 జూన్ 15 నుంచి ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. 7,090 మీటర్ల ఎత్తైన రెండు టవర్లతో నిర్మించిన ఈ చర్చిలో 1923 వరకు జర్మనీ దేశస్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. 1924 నుంచి ఇప్పటివరకు జాతీయ గురువులైన రెవరెండ్ ఆర్డీపీ అగస్టీన్ మొదలుకుని ప్రస్తుత ఫాదర్ డేగల దేవానందం వరకు 24 మంది పాస్టర్లు సువార్త పరిచర్య చేస్తూ వచ్చారు. ఇటీవల వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత నిధులు రూ.25 లక్షలతో ఈ చర్చి పునర్నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు.
క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన ప్రార్థనాలయాలు చలువరాతి మందిరాల్లో చల్లని దీవెనలు
Comments
Please login to add a commentAdd a comment