క్రిస్మస్ సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు
ఎస్పీ కంచి శ్రీనివాసరావు
నరసరావుపేట: క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థన స్థలాలు, ముఖ్యమైన ప్రదేశాలలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 24న మంగళవారంరాత్రి నుంచి ప్రార్థనలు జరగనున్న దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. రాత్రి సమయాలలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని చెప్పారు. ప్రజలు రాత్రిళ్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రమాదకరరీతిలో, ఇతరులను భయభ్రాంతులకు గురిచేసేలా వాహనాలు నడపవద్దని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
తొమ్మిది మండలాల్లో తేలికపాటి వర్షం
కొరిటెపాడు: గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం మంగళవారం ఉదయం వరకు తొమ్మిది మండలాల్లో జల్లులతో కూడిన తేలికపాటి వర్షం పడింది. అత్యధికంగా కొల్లిపర మండలంలో 4.2 మిల్లిమీటర్ల వర్షం పడగా, అత్యల్పంగా తెనాలి మండలంలో 0.4 మిల్లిమీటర్ల వర్షం పడింది. మండలాలవారీగా దుగ్గిరాల 1.4, పెదనందిపాడు 1.2, చేబ్రోలు 1, గుంటూరు పశ్చిమ 1, కుమాను 1, మంగళగిరి 0.8, పొన్నూరు మండలంలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షం పడింది. మరో రెండు రో జుల పాటు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
నరసరావుపేట: జిల్లాలో సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వరి కొనుగోలు, రెవెన్యూ సదస్సులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం దిశగా అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సులను జయప్రదం చేయాలని కోరారు. ఎప్పటికప్పుడు ప్రజలు, ప్రభుత్వ పనులను సత్వరం పూర్తిచేసి జిల్లాను మొదటి ఐదు స్థానాల్లో ఉంచాలని వివరించారు. డీఆర్వో ఏకా మురళి, ఏడీ సర్వేయర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా రంగారావు
బాధ్యతల నుంచి మంత్రునాయక్ తొలగింపు
నరసరావుపేట టౌన్: స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి డాక్టర్ ఎం.మంత్రునాయక్‌ను తప్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జిగా బాధ్యతలను జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణ అధికారి(డీసీహెచ్‌ఎస్) డాక్టర్ బీవీ రంగారావుకు అప్పగించారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించటంలో విఫలమయ్యారనే అభియోగం మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లుగా తెలిసింది. రెండు నెలల క్రితం లింగంగుంట్ల హాస్పిటల్ ఆవరణలో కొందరు టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అర్ధరాత్రి సమయంలో మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేయటం, హాస్పిటల్ పక్కనే జిల్లా పోలీసు కార్యాలయం ఆధీనంలోని భూమిని ఖాళీ చేయాలంటూ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లేఖ పంపడంపై జిల్లా ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు స్థానిక టీడీపీ ముఖ్యనేత కూడా సూపరింటెండెంట్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గైనకాలజిస్టుగా మంచి డాక్టర్‌గా పేరు పొందినా హాస్పిటల్ నిర్వహణ ఆర్‌ఎంకు వదిలేసి పల్నాడు రోడ్డులోని పాత ప్రభుత్వ హాస్పిటల్‌కే పరిమితం కావడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపఽథ్యంలో డాక్టర్ మంత్రునాయక్‌ను తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై డీసీహెచ్‌ఎస్ రంగారావును సంప్రదించగా మంత్రునాయక్‌ను తప్పిస్తూ తనను ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన మాట నిజమేనని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment