అసమాన ప్రతిభ చూ‘శ్యాం’
అమరావతి: ప్రఖ్యాత బాలీవుడ్ సినీ దర్శకుడు, దూర్‌దర్శన్‌లో అనేక ధారావాహికల రూపకర్త పద్మభూషణ్ శ్యాంబెనగల్ సోమవారం మరణించటంతో అమరావతి వాసులు ఆయనతో తమ గ్రామానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన అసమాన ప్రతిభను చూశామని, ఆ భాగ్యం తమకు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తూనే ఆయన మరణం బాధాకరమని సంతాపం తెలియజేశారు. 1975–77 మధ్య అమరావతికి చెందిన రచయిత శంకరమంచి సత్యం వంద కథలతో అమరావతి కథలు అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకానికి 1979లో అంధ్రరాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్యాంబెనగల్ అమరావతి కథలలో 13 కథలను దూరదర్శన్‌లో ప్రసారానికి ధారావాహికలు చిత్రీకరించాలని నిర్ణయించారు. ఈక్రమంలో అమరావతి కతియాన్ అనే ధారావాహికను పూర్తిగా అమరావతి, ఇక్కడి పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. 1994–95 సంవత్సరాల్లో సుమారు మూడునెలల పాటు ఆ ధారావాహికను 90శాతం ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ కోసం దర్శకుడితోపాటు జాతీయస్థాయి టీవీ నటులు వీరేంద్రసక్సేనా, పల్లవిజోషి, నీనాగుప్తా, మోహన్‌గోఖలే, దీపికా అమిన్, రణబీర్‌యాదవ్, లలిత్‌తివారి, సులభఅర్యా, రవిజంఖాల్ తదితరులు వచ్చి ఇక్కడే మకాం వేశారు. షూటింగ్‌ను తిలకించేందుకు అమరావతి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా అమరేశ్వరాలయం, పూజారివీధి, కృష్ణానది ఒడ్డున సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అప్పట్లో దర్శకుడు గ్రామస్తులతో కలివిడిగా వ్యవహరించారు. పూజారివీధిలో ఎక్కువగా షూటింగ్ చేయటంతో అమరేశ్వరస్వామి ఆలయ అర్చకులతో, వారి కుటుంబాలతో సన్నిహితంగా మెలగడం విశేషం. దీంతో అలనాటి విశేషాలను గ్రామస్తులు, అర్చకులు గుర్తుచేసుకుంటున్నారు. వైకుంఠపురం గ్రామంలోనూ కొంత చిత్రీకరణ జరగడంతో అక్కడి ప్రజలు అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. దిగ్గజ దర్శకుడి మృతి బాధాకరమని ఆవేదన చెందుతున్నారు.
అమరావతితో దర్శకుడు శ్యాంబెనగల్ అనుబంధం అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్న స్థానికులు దిగ్గజ దర్శకుడి మరణం బాధాకరమని సంతాపం
Comments
Please login to add a commentAdd a comment