రబీకి వికర్షకం
గత ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా నిధులను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేశారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆర్బీకేల ద్వారా విత్తనాలు మొదలు పండిన పంటకు గిట్టుబాటు ధర లభించేవరకు ప్రతి దశలో అండగా నిలిచారు. అలాంటి సాయం కారణంగానే గతేడాది ప్రతికూల పరిస్థితుల్లోనూ పంట లసాగు అధికంగా ఉందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిశాయి. సాగునీటి అవసరాలు తీర్చే నాగార్జున సాగర్ ఆగస్టులోనే నిండింది. ఎగువ నుంచి జలాలు వస్తుండటంతో దాదాపుగా పూర్తిస్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. దీంతో అందరూ ఈ ఏడాది రబీ సాగు విస్తీర్ణం సాధారణం కన్నా అధికంగా ఉంటుందని భావించారు. అయితే దీనికి భిన్నంగా సాగు మందగించింది. ఈ ఏడాది రబీ సాగు విస్తీర్ణం 54,622 హెక్టార్లుగా వ్యవసాయశాఖ అధికారులు లెక్కగట్టారు. ఇప్పటివరకు 23,434 హెక్టార్లలో మాత్రమే సాగు ఆరంభమైంది. గతేడాది ఇదే సమయానికి 26,322 హెక్టార్లలో సాగు ప్రారంభం కావడం గమనార్హం. గతేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో సాధారణ వర్షపాతం 186.1 మి.మీ. కాగా 119 మి.మీ. మాత్రమే నమోదైంది. వేసిన అరకొర పంటలనూ దెబ్బతీసేలా డిసెంబర్‌లో సాధారణ వర్షపాతం 8.6 మి.మీ. కాగా ఏకంగా ఆ నెలలో 130.8 మి.మీ. కురిసింది. ఇలా రైతులకు ఉపయుక్తంగా వర్షాలు కురవలేదు. మరోవైపు ఎగువ నుంచి కృష్ణా నదిలో ప్రవాహాలు సరిగా లేకపోవడంతో సాగర్ క్లస్టర్ గేట్లు ఎత్తే అవకాశం రాలేదు. ఇన్ని ప్రతికూల అంశాలున్నా గత ఏడాది ఇదే సమయానికి రబీలో అధిక హెక్టార్లలో సాగు జరిగింది.
వరి, మొక్కజొన్నలకే మొగ్గు..
రబీలో ఈఏడాది అత్యధికంగా 5,922 హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగైంది. ఇది మరికొంత పెరిగే అవకాశముంది. గత రబీలో 2,244 హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్న సాగైంది. ఖరీఫ్‌లో పత్తిపంట సాగుచేసిన రైతులు రెండో పంటగా మొక్కజొన్నవైపు మొగ్గుచూపారు. వరి గతేడాది ఇదే సమయంలో 534 హెక్టార్లలో సాగవ్వగా ఈ ఏడాది 5,678 హెక్టార్లలో సాగవుతోంది. ఇదీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మంచి శనగ సాధారణ విస్తీర్ణం 11,798 హెక్టార్లకు ఇప్పటివరకు 4,739 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గతేడాది ఈసమయానికి 15,365 హెక్టార్లలో సాగైంది. కంది 1,080 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గతేడాది కంది 3,071 హెక్టార్లలో సాగైంది.
ప్రభుత్వ సాయం లేకనేనా..?
పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రభుత్వం నుంచి సాయం కరువు కావడంతో కర్షకులు ఈ ఏడాది రబీ సాగుకు విముఖత వ్యవక్తం చేస్తున్నారు. పత్తి పంటకు అనుకున్నంత దిగుబడిలేక రైతులకు పెట్టుబడి కూడా రాలేదు. మిర్చి ధరలు అమాంతం పడిపోయాయి. కొందరు రైతులు మిర్చిని కోయకుండా వదిలేశారు. వరిలో తేమశాతం పేరు చెప్పి దళారులు, వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ఈ సమయంలో రైతుకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పెట్టుబడి సాయంగా ఏటా ఇస్తామన్న రూ.20 వేల ఆర్థిక సాయం ఇప్పటికీ ఇవ్వలేదు.
మందగించిన సాగు
విస్తారంగా వానలు, సమృద్ధిగాసాగునీరు ఉన్నా వెనకడుగు గత ఏడాదితో పోలిస్తే మూడువేల హెక్టార్లకుపైగా తగ్గిన విస్తీర్ణం తగ్గిన శనగ, కంది పంటల సాగు వరి, మొక్కజొన్నకే పరిమితమైన వైనం ప్రతికూల పరిస్థితులున్నా.. గత ఏడాది సాగుకు మొగ్గుచూపిన రైతులు ఈ ఏడాది ప్రభుత్వ సాయం అందక పోవడమే కారణమంటున్న కర్షకులు
గత ఏడాది అప్పటి ప్రభుత్వం అండ
కూటమి ప్రభుత్వం అండగా ఉండడం లేదు
కూటమి ప్రభుత్వం రైతులకు ఏదశలోనూ అండగా నిలబడకపోవడం దురదృష్టకరం. అన్నదాత సుఖీభవ పేరిట రూ.20 వేలు ఇస్తామన్న సీఎం చంద్రబాబు ఆ ఊసే ఎత్తడం లేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేయడం రైతులను కుంగదీసింది. కేవలం వరికి మాత్రమే రైతులు ప్రీమియం చెల్లించే అవకాశం ఇవ్వడం సరికాదు. అన్ని పంటలకు ప్రభుత్వమే బీమా చెల్లించాలి. మరోవైపు సాగర్‌లో నీరున్నా కాలువల ఆధునికీకరణ లేకపోవడంతో నీరు వృథా అవుతోంది. రబీ సాగు తక్కువగా ఉండటానికి ఇదో కారణం. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్‌బీకేలను ఆర్‌ఎస్‌కేలుగా మార్చి కూటమి సర్కారు నిర్వీర్యం చేసింది.
– ఏవూరి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment