సమైక్యంగా సమరనాదం
● చుండూరు మండలంలో ఏకతాటిపైకి వైఎస్సార్ సీపీ నేతలు ● గతంలో గ్రూపులతో బలహీనపడిన పార్టీ ● కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు ● అశోక్‌బాబు చొరవతో వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీవర్గాల ఐక్యనినాదం
చుండూరు(తెనాలి): బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలంలోని వైఎస్సార్ సీపీ నేతలు ఏకతాటిపైకి వచ్చారు. సమైక్యంగా సమరనాదం మోగించారు. కలిసుంటే కలదు జయమని నినదించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో మంగళవారం తాడేపల్లి వెళ్లి పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. ఐక్య నినాదం వినిపించారు.
తొలి నుంచీ వైఎస్సార్ సీపీకి కంచుకోట
చుండూరు మండలం వైఎస్సార్ సీపీకి తొలి నుంచి కంచుకోట. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన డాక్టర్ మేరుగ నాగార్జునకు ఈ మండలంలో 4,800 ఓట్ల ఆధిక్యత లభించింది. తర్వాత జరిగిన పంచాయతీలు, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులు, మద్దతునిచ్చినవారే ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వర్గవిభేదాలు పొడచూపాయి. నేతలు గ్రూపులుగా విడిపోయారు. ఈ పరిణామం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. మండలంలో మెజార్టీ 600కు పడిపోయింది. దీంతో పార్టీ అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు ఓటమిపాలయ్యారు. వైఎస్సార్ సీపీ నేతలు వర్గాలుగా విడిపోవడంతో కూటమి ప్రభుత్వం రాగానే టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శ్రేణులపై దాడులకు దిగారు. కేసులు పెట్టేలా పోలీసులను పురిగొల్పారు.
అశోక్‌బాబు చొరవతో మళ్లీ ఏకమై
చుండూరు మండలంలో పార్టీ బలహీనపడడానికి గ్రూపు విభేదాలే కారణమని గ్రహించిన నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతల మధ్య సయోధ్యకు చొరవ చూపారు. మండల విస్తృత సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. క్యాడర్ ఇబ్బందులను చర్చించారు. అందరూ ఒకటి కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఏకాభిప్రాయాన్ని సాధించారు. పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన అభయం ఇప్పించాలని తలపోశారు. కూటమి అధికారంలోకి రాగానే పార్టీ క్యాడర్‌పై దాడులు, అక్రమ కేసులు వంటి చిల్లర పనులకు దిగిన వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబే వైఎస్సార్ సీపీని మళ్లీ బలోపేతమయ్యేలా చేశారని అశోక్‌బాబు అభివర్ణించడం విశేషం. అశోక్‌బాబు గ్రామగ్రామాన పర్యటించి కిందస్థాయి నేతలందరి అంగీకారంతో గ్రామ కమిటీలను నియమించారు.
గొప్ప ముందడుగు
వైఎస్సార్ సీపీ నేతలు వర్గవిభేదాలు వీడి మళ్లీ ఏకతాటిపైకి రావడం గొప్ప ముందడుగు. ఇకపై కూటమి అరాచకాలను సహించేది లేదని, సమష్టిగా సమరనాదం పూరిస్తామని నాయకులంతా ఐక్యంగా నినదించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిశీలకుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మంగళవారం కలిసి ఇకపై పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అంతా కలుసుండాలని, పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో చుండూరు ఎంపీపీ జాలాది రూబేను, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ అన్నపరెడ్డి రఘురామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గాదె శివరామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ వుయ్యూరు అప్పిరెడ్డి, జాలాది రమేష్, దాట్ల మోహన్‌రెడ్డి, అన్నపరెడ్డి వీరారెడ్డి, ఈమని వెంకటేశ్వరరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment