ఖాకీల తీరు అ‘సమం’జసం | - | Sakshi
Sakshi News home page

ఖాకీల తీరు అ‘సమం’జసం

Published Wed, Dec 25 2024 2:36 AM | Last Updated on Wed, Dec 25 2024 2:35 AM

ఖాకీల తీరు అ‘సమం’జసం

ఖాకీల తీరు అ‘సమం’జసం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. నేరం చేసిన వారిపైన, బాధితులపైన ఒకే తరహా సెక్షన్లు నమోదు చేయడం పట్టాభిపురం పోలీసులకే చెల్లింది. పట్టపగలు 50 మంది ఓ ఇంటిపై దాడిచేసి సామగ్రి బయటపడేసి ఓ కుటుంబాన్ని రోడ్డుపాలు చేసి ఆ ఇంటిని ఆక్రమించుకుంటే.. పోలీసులు మొక్కుబడిగా ఇంట్లోకి అక్రమ ప్రవేశం, గాయపరచడం, బెదిరింపు వంటి బెయిలబుల్‌ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. బాధితులపైనా అవే సెక్షన్లు పెట్టి ‘సమ’న్యాయం చూపించారు. దీంతో ఖాకీల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ నేత దౌర్జన్యం

పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాయిబాబా రోడ్డు శాంతినగర్‌ 2వ లైన్‌లో నగర డెప్యూటీ మేయర్‌, వైఎస్సార్‌ సీపీ తాడికొండ ఇన్‌చార్జి వనమా వజ్రబాబు (డైమండ్‌ బాబు) సోదరి వజ్రకుమారి ఇంట్లోకి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్‌కిరణ్‌ ఆదివారం మధ్యాహ్నం సుమారు 50 మంది అనుచరులతో దౌర్జన్యంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. వజ్రకుమారి ఇంట్లోని సామగ్రిని బయటపడేయడంతోపాటు ఆ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళతోపాటు, పసిపిల్లలనూ బయటకు తోసేశారు. ఆ తరువాత టీడీపీ నేతలు, వారివెంట వచ్చిన అనుచరులు ఆ ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఈ స్థలం విషయంలో 1978 నుంచి వివాదం నడుస్తోంది. స్వాధీనం అగ్రిమెంట్‌పై అమ్మిన వ్యక్తి తర్వాత రేటు పెరిగిందని రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో కొన్నేళ్లుగా కోర్టులలో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని టీడీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డైమండ్‌బాబు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేసి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ వేచి ఉన్నా కిందిస్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకున్న సీఐ మాత్రం ఘటనా స్థలానికి రాలేదు. డైమండ్‌బాబు ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత అక్కడికి చేరుకున్న సీఐ వీరేంద్రబాబు టీడీపీ నాయకులకు వత్తాసు పలికారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టి డైమండ్‌బాబును బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే విజయ్‌కిరణ్‌ స్టేషన్‌లో తమ అదుపులో ఉన్నాడని, ఇంట్లో ఉన్నవారిని రెవెన్యూ అధికారుల సమక్షంలో బయటకు పిలిపిస్తామని సీఐ మీడియాతో చెప్పారు. అయితే ఆ సమయంలో విజయ్‌కిర ణ్‌ ఘటనా స్థలంలోనే ఉండటం గమనార్హం. ముందు గా పోలీసులతో మాట్లాడుకున్న తర్వాతే విజయ్‌కిరణ్‌ దౌర్జన్యానికి దిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

సోషల్‌ మీడియా కేసుల్లోనూ ఇదే తీరు

సోషల్‌ మీడియా పోస్టుల విషయంలోనూ పట్టాభిపురం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది. వైఎస్సార్‌సీపీ నేతలైతే ఒక లెక్క.. అధికార పార్టీ నేతలైతే మరో లెక్క అన్నట్టుగా పోలీసుల వ్యవహారం ఉంది. మాజీ మంత్రులు విడదల రజిని, మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ సోషల్‌ మీడియాపై చేసిన ఫిర్యాదులపై ఇప్పటివరకు పోలీసులు కేసులు పెట్టకపోవడం గమనార్హం.

ఇదెక్కడి న్యాయం!

నిందితులపైనా, బాధితులపైనా ఒకే సెక్షన్లు ! ఇంట్లో సామగ్రి బయటపడేసి నడి వీధిలోకి గెంటేసిన వారివైపే మొగ్గు! అధికార పార్టీ నేతలు చెబితేనే కేసులు! లేకపోతే ఎఫ్‌ఐఆర్‌ కూడా కట్టని వైనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement