నల్లచట్టాలను దొడ్డిదారిన తేవాలనుకోవడం దుర్మార్గం
● కేంద్రం తెచ్చిన నూతన బిల్లును రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాల నేతల నిరసన
లక్ష్మీపురం: రైతాంగ పోరాట ఫలితంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు పరిచిన ప్రధాని నరేంద్ర మోదీ ఇదే చట్టాలను దొడ్డిదారిన వివిధ పేర్లతో మళ్లీ యావత్తు రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా తీసుకురావడం చాలా దుర్మార్గమని జిల్లా రైతు సంఘం కార్యదర్శి కంచుమాటి అజయ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అన్నారు. జాతీయ అగ్రికల్చర్ మిషన్ పేరుతో వ్యవసాయ మార్కెటింగ్‌ను దెబ్బతీసే విధంగా నూతన బిల్లు కాపీని గుంటూరు కలెక్టరేట్ ముందు సోమవారం రైతు, కార్మిక, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో దహనం చేసి, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులను కార్పొరేటర్ పరం చేసేందుకు ‘నేషనల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్‘ పేరుతో పెద్ద కుట్రతో నూతన చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. వీటిని ఉపసంహరించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు పాశం రామారావు, జొన్న శివశంకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు జగన్నాథం, కృష్ణ, విటల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment