హెల్మెట్ లేకుండా పరిమితికి మించి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కుటుంబం
గీత దాటితే మోతే..
భారీగా ట్రాఫిక్ చలానాల పెంపు
నిబంధనల ఉల్లంఘనపై కొరడా
సుప్రీం ఆదేశాలతో ప్రభుత్వాల్లో కదలిక
జరిమానాలపై దృష్టి సారించిన పోలీస్ యంత్రాంగం
రోడ్డు ప్రమాదాల నివారణకే చర్యలు
ఈ ఏడాది 758 రోడ్డు ప్రమాదాలు 380 మంది మృత్యువాత
నరసరావుపేటటౌన్: రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ ప్రమాదాల్లో అధిక శాతం హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోడం వల్లనే జరుగుతున్నాయి. ఆదివారం వినుకొండలో బైక్‌పై వస్తున్న అన్నాదమ్ములను కారు ఢీకొంది. ఘటనలో అన్న మృతి చెందగా, తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురిని నడికుడి శివారులో మినీ లారీ ఢీకొంది.
ఘటనలో గురజాలకు చెందిన రామారావు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలు ఒకే రోజులో జరిగాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 758 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా, వీటిల్లో 380 మంది మృత్యువాత పడ్డారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ ఈ కేసులు అధికంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో కొందరు మృత్యువాత పడితే, మరి కొందరు దివ్యాంగులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలను విపరీతంగా పెంచేసింది.
సిబ్బంది కొరత
పోలీసు శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత ప్రభుత్వంలో కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కోడ్ అడ్డుగా నిలిచింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది బందోబస్తు, ప్రొటోకాల్ వంటి డ్యూటీలు అధికంగా ఉండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ రెండు కేసుల్లో ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం వల్లే నిండు ప్రాణాలు బలయ్యాయి. అందుకే ట్రాఫిక్ నియమ, నిబంధనల అమలును సుప్రీం కోర్టు సీరియస్‌గా పరిగణించింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాఫిక్ ఉల్లంఘనులపై కొరడా ఝుళిపిస్తున్నాయి. నిబంధనలు మీరితే భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యాయి.
‘అమ్మా.. ఇక్కడ బయలుదేరాను.. సాయంత్రానికి ఇంట్లో ఉంటాను బై అమ్మా’ అని చెప్పిన కొడుకు.. ఇంటికి రాకముందే గుండెలు పగిలే విషాద వార్త తలుపుతట్టింది. నరసరావుపేట పట్టణానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ వీకెండ్‌లో స్వగ్రామానికి బయలుదేరాడు. బైక్‌పై వస్తుండగా మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. తల్లిదండ్రులకు నూరేళ్లకు సరిపడా వేదన మిగిల్చాడు.
పెంచిన జరిమానాలు ఇలా(రూపాయల్లో)..
మీరిన నిబంధన; గతం; ప్రస్తుతం;
హెల్మెట్, సిగ్నల్ ఉల్లంఘన; 100; 500
అథారిటీ ఆదేశాల ధిక్కరణ; 500; 5,000
లైసెన్స్ లేని డ్రైవింగ్; 500; 5,000
అతివేగం; 400; 1,000
ప్రమాదకర డ్రైవింగ్; 1,000; 5,000
డ్రంక్ అండ్ డ్రైవ్; 2,000; 10,000
రేసింగ్ అండ్ స్పీడ్; 500; 5,000
(ఈ జరిమానాల అమలుపై పోలీసు యంత్రాంగం ఇప్పటికే దృష్టి సారించింది. రోజూ తనిఖీలు నిర్వహించి చలానాలు రాయటం ముమ్మరం చేశారు.)
Comments
Please login to add a commentAdd a comment