ఆరుతడికీ కంటతడే!
పెదకూరపాడు: అమరావతి మేజర్ కాలువ పరిధిలోని దిగువన ఉన్న పెదకూరపాడు మండలంలోని ఎస్, ఎన్, క్యూ, బీ మైనర్లకు సాగునీరు అందక ప్రతి ఏడాది సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి. ఈ ఇబ్బందులు అన్నదాతలకు కన్నీటినే మిగుల్చుతున్నాయి. మిర్చి పంట, మొక్కజొన్నకు సాగునీరు ఎంతో అవసరం. పెదకూరపాడు మండలవ్యాప్తంగా మిర్చి సాగుకు పెట్టింది పేరు. పంట కాపు మీద ఉండగా సాగునీరు అందక రైతులు అల్లాడుతున్నారు. పది రోజులుగా తగిన నీరు లేక మిరప పంటలు బెట్టకు వచ్చాయి. దీంతో రైతు ప్రతి ఏడాది ఇదే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
సత్తెనపల్లి స్టేషన్ వరకే....
అమరావతి మేజర్‌కు ఇరిగేషన్ అధికారులు 330 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ మేజర్‌పై ఉన్న సత్తెనపల్లి స్టేషన్ వరకే నీరు సమృద్ధిగా వస్తోంది. అబ్బూరు కాలువ మరమ్మతులు చేయడంతో అక్కడికే ఎక్కువగా వెళుతోంది. సత్తెనపల్లి స్టేషన్‌లో కూడా ఈ, టీ మైనర్లకు అందుతోంది. దీని పరిధిలో సుమారు 5 షట్టర్లు మరమ్మతులకు వచ్చాయి. అమరావతి మేజర్‌పై ఆకు పేరుకుపోవడంతో సాగునీరు దిగువకు రావడం లేదు. పెదకూరపాడు మండలంలోని ఎస్, ఎన్, క్యూ, బీ మైనర్లకు అందడం లేదు. వీటి కింద 4 వేల ఎకరాలు సాగు చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది.
మిర్చికి పెద్ద దెబ్బే...
మిర్చి పంట కాపు, పిందె దశలో ఉండటంతో సాగునీరు ఈ సమయంలో ఎంతో అవసరం. అమరావతి మేజర్‌కు నీరు సక్రమంగా రాకపోవడంతో వ్యయప్రయాసలతో రైతులు కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుంటలు, బావులను ఆశ్రయించి పంటకు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోటార్లు సహాయంతో కిలోమీటర్ల పొడవునా పైపుల ద్వారా నీరు అందిస్తున్నారు. అసలే ధరలు లేక, పెట్టుబడులు పెరిగి అల్లాడుతున్న మిరప రైతులకు సాగునీటి సమస్య మరో భారంగా మారింది.
అమరావతి మేజర్ దిగువ భూములకు అందని సాగునీరు సత్తెనపల్లి స్టేషన్ వరకే సమృద్ధిగా రాక అల్లాడుతున్న మిరప రైతులు బెట్టకు వచ్చిన పంట చేలు
ఇప్పుడే సాగునీరు అవసరం
ప్రస్తుతం మిరప పంటకు సాగునీరు ఎంతో అవసరం. పంట పిందె మీద ఉంది. కాయగా మారేందుకు నీరు పెట్టాలి. చేలు ఇప్పటికే బెట్టకు వచ్చాయి. సకాలంలో నీరు అందితే బాగుంటుంది. అసలే ధరలు లేక నష్టాల్లో ఉన్నాం.
– కురగంటి మస్తాన్,
కౌలు రైతు, పెదకూరపాడు
నాలుగు రోజుల్లో పరిష్కరిస్తాం
షట్టర్లు రిపేరు, ఆకు పేరుకుపోవడంతో సాగునీరు దిగువకు పారడం లేదు. నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం. అన్ని మైనర్లలో దిగువకు నీరు వెళ్లేలా తగిన చర్యలు తీసుకుంటాం.
– పేరం చిరంజీవి రెడ్డి,
ఏఈ, ఇరిగేషన్, పెదకూరపాడు
Comments
Please login to add a commentAdd a comment