వైభవంగా మల్లాది వేంకటేశ్వరుని కళ్యాణం
అమరావతి: భక్తుల పాలిట కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీర్చే కలియుగవరదుడైన వేంకటేశ్వరుడే మల్లాది గ్రామంలో స్వయంభూగా వెలసిన వటవృక్షాంతర్గత వేంకటేశ్వరునికి బుధవారం 48వ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయ అర్చకుడు వినుకొండ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారి అభిషేకానికి బిందెతీర్థంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అనంతరం సుప్రభాతసేవతో స్వామి వారిని మేల్కొలిపి ప్రాతఃకాల అర్చన నిర్వహించారు. స్వామి వారికి పంచసూక్తాలతో పంచామృత స్నపనను సశాసీ్త్రయంగా చేశారు. అనంతరం భక్తులు తెచ్చిన తులసీదళాలతో స్వామి వారికి సహస్రనామ తులసీదళసేవ జరిగింది. స్వామి వారికి విశేష అలంకారం చేశాక భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం పదకొండు గంటలకు దేవాలయ ఉత్తరభాగంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామి వారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. కళ్యాణోత్సవ ఘట్టాన్ని ప్రారంభించారు. పరుచూరి శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో సుమారు 70 మంది దంపతులచే స్వామి వారి కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు పెదశేష వాహనంపై ఉభయదేవేరులతో వెంకటేశ్వరుని గ్రామోత్సవం వైభవంగా సాగిందిరు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత ప్రసాదాలను అందజేశారు. సుమారు 5 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. కళ్యాణోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలరించాయి. సీతారామాంజనేయ భక్తసమాజం వారి భజన, శ్రీ వేంకటేశ్వరస్వామి బాలబాలికల కోలాటం సేవభజన సంఘం చిన్నారుల కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రోసూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వెంపాజ్వాలా లక్ష్మీనరసింహారావు, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు భవిరిశెట్టి హనుమంతరావు తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment