ఇద్దరు ద్విచక్ర వాహన చోరులు అరెస్టు
రూ.8.50 లక్షల విలువైన 16 బైకులు స్వాధీనం
నూజెండ్ల(శావల్యాపురం): ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8.50 లక్షల విలువైన 16 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్‌రావు శనివారం ఐనవోలు పోలీసు స్టేషనులో విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు... బైకు చోరీలపై ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ గ్రామాల్లో దొంగిలించిన బైకులను నూజెండ్ల మండలం రవ్వారం కొండ వెనుకభాగాన నిందితులు దాచిపెడుతూ కొన్నాళ్లకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలా స్వాధీనం చేసుకున్న 16 బైకుల విలువ రూ. 8.50 లక్షలని చెప్పారు. నిందితులైన రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వనిపెంట బాలకాశిరెడ్డి, నూజెండ్ల మండలం రవ్వారం గ్రామానికి చెందిన పడిగాపాటి గురవారెడ్డిలను అరెస్ట్ చేశామన్నారు. వాహన తనిఖీల సమయంలో చిక్కిన వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. నిందితుల అరెస్టులో ప్రతిభ చూపిన ఐనోలు ఎస్సై కృష్ణారావు, సిబ్బందిని రూరల్ సీఐ అభినందించారు. రివార్డులకు సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment