ముత్తూట్ ఫైనాన్స్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
అడ్డగోలుగా వడ్డీ లెక్కించారని ఆరోపణ
సత్తెనపల్లి: ముత్తూట్ ఫైనాన్‌న్స్ సంస్థలో గోల్డ్ లోన్‌కు వడ్డీ అడ్డగోలుగా లెక్కించారని ఆరోపిస్తూ శనివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఆ కార్యాలయం ఎదుట దంపతులు పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందిన విప్పర్ల సైదులు, మంగమ్మ దంపతులు సత్తెనపల్లి ముత్తూట్ సంస్థలో 4 సవర్ల బంగారు ఆభరణాలు కుదువ పెట్టి రూ. 85 వేలు రుణం తీసుకున్నారు. ఏడాది తరువాత రెన్యువల్ సమయంలో మరో రూ. 20 వేలు రుణంగా ఇచ్చారు. సైదులు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించడంతో పాటు అసలులో జమ వేసుకుంటూ వచ్చారు. పోన్ పే ద్వారా కొంత నగదు చెల్లించారు. రశీదులు ఇవ్వమని అడిగితే సర్వర్ పని చేయడం లేదంటూ సిబ్బంది దాటవేత ధోరణి అవలంబిస్తూ వచ్చారు. ఇంకా కేవలం రూ. 26,600 మాత్రమే చెల్లించాల్సి ఉందని, రూ.1.44 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో తమ మధ్య గొడవలు అవుతున్నాయని దంపతులు తెలిపారు. పోలీసులు దృష్టికి వెళ్లినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవడంతో దంపతులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment