నరసరావుపేట టౌన్: నార్కోటిక్ పోలీసుల పేరిట బెదిరించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వద్ద రూ.11 లక్షలను సైబర్ నేరస్తులు కాజేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద చెరువు మూడవ లైనుకు చెందిన సాయిసత్యశ్రీ హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తూ నరసరావుపేటలో ఉంటున్నారు. ఈమెకు గతేడాది అక్టోబర్ 22వ తేదీన అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను ముంబై నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు ఆకాష్ అని పరిచయం చేసుకున్నాడు. ఆమె పేరుతో ఒక కొరియర్ వచ్చిందని, అందులో లాప్‌టాప్, 450 గ్రాముల గంజాయి ఉందని చెప్పాడు. ఆమె క్రెడిట్ కార్డుతో ఇవి కొనుగోలు చేసినట్లు, సదరు క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పి నమ్మించాడు. అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలంటే తనకు రూ.11 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలన్నాడు. దీంతో సత్యశ్రీ తన ఖాతా నుంచి అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఖాతాకు రూ.11 లక్షలు నగదు పంపారు. ఈ విషయాన్ని రెండో రోజు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారిచ్చిన సలహా మేరకు అక్టోబర్ 24వ తేదీన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో శనివారం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లేఖ ప్రియాంక తెలిపారు.
యువతిని బెదిరించి రూ.11 లక్షలు స్వాహా కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment