నరసరావుపేట: వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్లకు అవసరమైన కార్యాలయాలు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... వారికి హక్కులపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. ఆ శాఖ కార్యాలయాన్ని పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల వద్ద ఖాళీగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ భవనంలోనికి మార్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులోనే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల అసోసియేషన్‌లకు కార్యాలయాలు కేటాయిస్తామని తెలిపారు. వయోవృద్ధులకు ప్రతి సోమవారం అర్జీలు ఇచ్చేందుకు బస్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు మూడు నెలలకొకసారి పింఛను తీసుకోవచ్చని అన్నారు. ఆస్తులను పిల్లలకు పంచిన తర్వాత నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు నిబంధనల మేరకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి సువార్త తాము అందిస్తున్న సేవల గురించి వివరించారు. డీఆర్‌డీఏ పీడీ బాలూ నాయక్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బీవీ రంగారావు, ఎల్‌డీఎం రాంప్రసాద్, గృహ నిర్మాణశాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా విద్యా శాఖాధికారి ఎల్.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
పోర్టల్‌లో కార్మికుల వివరాలు నమోదు చేయండి
నరసరావుపేట: జిల్లాలో ఉన్న అసంఘటిత రంగ కార్మికుల వివరాలను మార్చి చివరిలోపు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కో ఆర్డినేషన్ సమావేశంలో పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని ప్లాన్లు మంజూరు చేసే మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, పుడా, ఏపీఐఐసీ, పరిశ్రమలు, కార్మికశాఖ అధికారులు ప్రతి నెల మూడవ తేదీలోపు ఒక శాతం సెస్ తగ్గింపు, చెల్లింపు వివరాలను పంపాలని సూచించారు. గతేడాది చైల్డ్ లేబర్ జిల్లా టాస్క్ ఫోర్సు టీం గుర్తించిన 22 మందిని బడిలో చేర్పించి, యాజమాన్యాలపై తీసుకున్న చర్యలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment