ఉత్సవ విగ్రహాలు బహూకరణ
పిడుగురాళ్ల : స్థానికంగా ఉన్న శ్రీ సువర్చల ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో సీతా రామలక్ష్మణ ఆంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలను బుధవారం బహూకరించారు. పట్టణానికి చెందిన వ్యాపారి పెరుమాళ్ల రాజేష్‌ఽ వారి ధర్మపత్ని వనజ లక్ష్మీలు సుమారు రూ.4.50 లక్షల వ్యయంతో ఉత్సవ విగ్రహాలను అందించారు. ఈనెల 25వ తేదీన ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం, రథోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ విగ్రహాలను బహూకరించడం జరిగిందన్నారు.
నేటి నుంచి మిర్చి యార్డులో రైతులకు ఉచిత భోజనం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో గురువారం నుంచి రైతులకు ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని ఉదయం 10.45 గంటలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు.
నరసింహస్వామికి
వెండి కిరీటం బహూకరణ
మంగళగిరి (తాడేపల్లిరూరల్) : మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తులు వెండి కిరీటాన్ని బుధవారం బహూకరణగా ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇ.వో. రామకోటిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన రామారావు తన భార్య అన్నపూర్ణ జ్ఞాపకార్ధం ఆయన కుమారులు మధుసూధన్, రవికిరణ్‌లతో కలసి 1.300 కిలోల వెండితో, 3 గ్రాముల బంగారుపూతతో చేసిన వెండి కిరీటాన్ని స్వామివారి అలంకరణ నిమిత్తం అందజేశారని తెలియజేశారు. అనంతరం రామారావు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
గుంటూరు–గయ ప్రత్యేక రైలు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని రైలు ప్రయాణికుల సౌకర్యార్ధం గుంటూరు–గయకు ప్రత్యేక రైలు కేటాయించడం జరిగిందని సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ బుధవారం తెలిపారు. నంబర్ 07719 గుంటూరు–గయ ఈ నెల 25న, 07720 గయ–గుంటూరు ఈనెల 27న ప్రత్యేక రైలు కేటాయించడం జరిగిందని తెలిపారు.
యార్డుకు 90,138 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు) : గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 90,138 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 87,523 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.7,200 నుంచి రూ.15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.7,500 నుంచి రూ.15,500 వరకు ధర లభించింది. ఏసీ కామన్ రకం రూ.7,200 నుంచి రూ.14,000 వరకు ధర పలికింది. ఏసీ ప్రత్యేక రకాలకు రూ.8,000 నుంచి రూ.15,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 59,487 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment