రోడ్డు.. మచ్చుకై నా కనిపిస్తే ఒట్టు
బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి
వాగుకు ఏటా వరద వచ్చినప్పుడు పక్క పొలాలు మునిగిపోతున్నాయి. భారీ వర్షాలు పడినా, కృష్ణానదికి వరద వచ్చినా వాగు పొంగి చప్టాపై మూడు నుంచి నాలుగు రోజులపాటు నీరు ప్రవహిస్తోంది. దీంతో అమరావతి – విజయవాడ మధ్య రాకపోకలు నిలిచి ఇబ్బంది పడుతున్నాం. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు వేగంగా పూర్తిచేయాలి.
– యలగాల పాపారావు, అమరావతి
మరమ్మతులైనా చేయండి
వైకుంఠపురం – అమరావతి మధ్య రాకపోకలకు ప్రతి రోజు ఇబ్బందులు పడుతున్నాం. భారీ ఇసుక లారీల వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఏ అవసరానికైనా వెళ్లాలంటే సుమారు 9 కిలోమీటర్ల పొడవునా రోడ్డు గుంతలుగా ఉండటం వల్ల నరకయాతన పడుతున్నాం. రోడ్డుకు కనీసం మరమ్మతులు చేయాలి.
– రంగిశెట్టి శ్రీనివాసరావు, వైకుంఠపురం
అమరావతి: వారసత్వ నగరం, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం, శైవాధ్యాత్మిక క్షేత్రమైన అమరావతికి విజయవాడ నుండి చేరుకోవాలంటే తుళ్లూరు మండలం దొండపాగు నుంచి ఉన్న మార్గమే కీలకం. అమరావతి వరకు సుమారు 20 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇటీవల సెప్టెంబరు నెలలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు ఊహించని రీతిలో అమరావతి – వైకుంఠపురం వరకు సుమారు 11 కిలోమీటర్ల పొడవునా రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. బస్సులు, లారీలు, కార్లే కాదు.. కనీసం ద్విచక్ర వాహనాలు తిరగటానికి కూడా వీలు లేకుండాపోయింది. వాహనచోదకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగకు గుంతలన్నీ పూడుస్తామని గొప్పలు చెప్పింది. కానీ ఇంతవరకు ఈ వైపు చూసిన ప్రజాప్రతినిధులుగానీ, అధికారులుగానీ లేరు. అమరావతికి విజయవాడ నుంచి రావాలంటే వ్యయప్రయాసలకు ఓర్చాల్సిందే. తుళ్ళూరు, దొండపాడు, వైకుంఠపురం మీదుగా రావాల్సి ఉంటుంది. లేకపోతే విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లి.. అక్కడి నుంచి అమరావతికి సుమారు 30 కిలోమీటర్లు అదనంగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. లేకుంటే కంతేరు, తాడికొండ, 14వ మైల్ మీదుగా సుమారు 20 కిలోమీటర్లు చుట్టి చేరుకోవాల్సిందే.
రోడ్డు నిర్మాణానికి రూ.44.18 కోట్లు
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కృషితో తుళ్లూరు నుంచి అమరావతి వరకు సుమారు 20 కిలోమీటర్లుపైగా నిర్మితమయ్యేలా ఈ రహదారి నిర్మాణానికి ఎన్‌డీబీ పథకం ద్వారా రూ. 44.18 కోట్లు మంజూరు అయ్యాయి. రోడ్డు వెంబడి అడ్డుగా పెద్ద చెట్లను తొలగించి, 20 కిలోమీటర్ల మేర ఉన్న కల్వర్టుల నిర్మాణం పూర్తి చేశారు. ఈ క్రమంలో నూతనంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ప్రమాదం అంచున రాకపోకలు
పెదమద్దూరు వాగుపై బ్రిడ్జి అడుగుభాగం పూర్తిగా ధ్వంసమైంది. తీవ్రంగా బలహీనపడటంతో సెప్టెంబరులో వరదలకు సైడ్ గోడలు కూలిపోయాయి. ప్రస్తుతం ప్రమాదకరస్థాయికి చేరింది. వాహనాల రాకపోకలను రోడ్డు భవనాల శాఖ నిషేధించింది. మట్టితో బ్రిడ్జి దెబ్బతిన్న దగ్గర మరమ్మతులు చేశాక అనుమతించారు. రాత్రిళ్లు ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మళ్లీ వాగులకు వరదనీరు వస్తే ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.
అధ్వానంగా మారిన అమరావతి – వైకుంఠపురం రహదారి
ప్రమాదం అంచున మద్దూరు వాగు వంతెనపై ప్రయాణం
త్వరగా బ్రిడ్జి నిర్మించాలి
2022లో అప్పటి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కృషితో తుళ్లూరు – అమరావతి వరకు రోడ్డు పనులు చేపట్టాలని నిర్ణయించారు. పెదమద్దూరు బ్రిడ్జి నిర్మాణం కూడా అందులో భాగంగా ఉంది. బ్రిడ్జికి అప్పటి మంత్రి జోగి రమేష్ శంకుస్థాపన కూడా చేశారు. పనులు 60 శాతం పూర్తయ్యేసరికి ప్రభుత్వం మారటంతో ఆగాయి. చిన్న వర్షాలకు కూడా వాగు పొంగి పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి. రాకపోకలు నిలిచిపోతున్నాయి. బ్రిడ్జి పనుల వేగవంతం చేసి వచ్చే వర్షాకాలానికి పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. యాత్రికులకు కోసం అమరావతి – దొండపాడు వరకు రోడ్డుకు సత్వరమే కనీసం మరమ్మతులైనా చేయాలని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment