![బాలుడ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ckpt03-150096_mr-1739217507-0.jpg.webp?itok=8QxZQssG)
బాలుడి అన్నవాహికలో ఇరుక్కున్న రూపాయి నాణెం
చిలకలూరిపేట: మూడేళ్ల బాలుడు మింగిన రూపాయి నాణాన్ని ఆధునిక ఎండోస్కోపి పద్ధతిలో వైద్యులు తొలగించిన ఘటన సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని డాక్టర్ ముప్పాళ్ల హనుమంతరావు ఆస్పత్రిలో జరిగింది. పట్టణానికి చెందిన ఓ మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ ఆదివారం రాత్రి రూపాయి నాణెం మింగాడు. రెండో రోజు మలంలో అదే పోతుందిలే అని కుటుంబ సభ్యులు భావించి ఊరుకున్నారు. బాలుడికి కడుపునొప్పి ఎక్కువ కావడంతో సోమవారం ఆస్పత్రికి తీసుకువచ్చారు. రూపాయి నాణెం బాలుడి అన్న వాహికలో ఇరుక్కుపోయినట్లు గుర్తించిన గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ ముప్పాళ్ల బలరామకృష్ణ తేజస్వి ఎండోస్కోపీ విధానంలో నాణేన్ని తొలగించారు. ఇటీవల ఎనిమిదేళ్ల బాలుడు పెన్‌క్యాప్ మింగిన సమయంలోనూ ఇదే విధానంలో తొలగించారు. డాక్టర్ బలరామ కృష్ణతేజస్వి మాట్లాడుతూ పిల్లల విషయంలో పెద్దలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలకు నాణేలు, బ్యాటరీ రింగ్ సెల్స్, చిన్న చిన్న వస్తువులు అందుబాటులో ఉంచరాదని చెప్పారు. ఒకవేళ పిల్లలు వాటిని పొరపాటున మింగితే అదే తెల్లారి మలంలో పోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే విష రసాయనాలు ప్రమాదం చేకూరుస్తాయని హెచ్చరించారు. ఏదైనా వస్తువు మింగిన ఆరు గంటల లోపు వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలన్నారు.
ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు
![బాలుడి అన్నవాహికలో ఇరుక్కున్న రూపాయి నాణెం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10ckpt02-150096_mr-1739217507-1.jpg)
బాలుడి అన్నవాహికలో ఇరుక్కున్న రూపాయి నాణెం
Comments
Please login to add a commentAdd a comment