ఎంఎల్‌ఎస్ స్టాక్ పాయింట్ తనిఖీ
సాలూరు: పార్వతీపురం సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ అశుతోష్ శ్రీవాత్సవ్ పట్టణంలోని ఎంఎల్‌ఎస్ స్టాక్ పాయింట్‌ను బుధవారం పరిశీలించారు. స్టాక్ రికార్డులను తనిఖీ చేశారు. సకాలంలో ప్రజలకు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ పాల్గొన్నారు.
వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలు
● అటవీశాఖ అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే
బొండపల్లి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న వన మిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అటవీశాఖ అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే తెలిపారు. బొండపల్లిలోని వన మిత్ర కేంద్రాన్ని ఆమె బుధవారం పరిశీలించారు. ప్రస్తుతం వనమిత్ర కేంద్రాలను ఉపాధిహామీ నిధులతో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సకాలంలో నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమె వెంట జిల్లా అటవీశాఖ అధికారిణి ప్రసున్న, పారెస్టు రేంజ్ అధికారులు జె.సింధు, బి.అప్పలరాజు ఉన్నారు.
పాఠ్యాంశ అవగాహనతో అధిక మార్కులు
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురంటౌన్: పాఠ్యాంశాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే అధిక మార్కులు సాధించడం సులభమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడం, పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించడం ‘మై స్కూల్–మై ప్రైడ్’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. పట్టణంలోని డీవీఎం ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాస రచన, బృంద చర్చలు, విజ్ఞాన ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల జ్ఞానం పెరుగుతుందన్నారు. సబ్జెక్టుల వారీగా టీచర్ల కొరత లేకుండా సర్దుబాటు చేశామని, విద్యార్థులకు బోధన విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చెప్పాలన్నారు. పాఠ్యాంశ సందేహాలను ఉపాధ్యాయులను అడిగి ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమయాన్ని వృథా చేయవద్దన్నారు. ప్రతిరోజూ నేర్చుకున్న పాఠ్యాంశాలపై పరీక్షలు రాయడం వల్ల నేర్చుకున్న చదువుపై పట్టు లభిస్తుందన్నారు. 10వ తరగతి చదువు అనంతరం ఉపాధి అవకాశాలు లభించే కోర్సులపై అవగాహన కల్పించారు.
రామతీర్థంలో అభివృద్ధి పనులు పునఃప్రారంభం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి పనులు ఎట్టకేలకు పునః ప్రారంభమయ్యాయి. దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఏడాది కిందటే శాశ్వత యాగశాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆలయంలో ఫ్లోరింగ్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర రాజగోపురం ఎదుట చేపట్టిన సుందరీకరణ పనులను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. షాపుల ఏర్పాటుకు ప్రధాన రహదారి నుంచి ప్రహరీని కుదించి కట్టాలని పనులను అడ్డగించారు. 3 నెలల నుంచి పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే, ట్రస్టీ ఆదేశాల మేరకు పనులు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment