కిడ్నాప్ కలకలం
● నలుగురు నిందితుల అరెస్ట్ ● పరారీలో మరో ముగ్గురు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్‌జిందాల్
శృంగవరపుకోట:
ఎస్.కోట మండలంలో ఓ వ్యక్తిని కిడ్నాప్‌చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఎస్.కోట పోలీసుల అప్రమత్తతో బాధితుడు క్షేమంగా బయటపడ్డారు. ఎస్.కోట పోలీస్ స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఘటన వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో కొట్టాం గ్రామానికి చెందిన దంతులూరి సూర్యనారాయణరాజును ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని, విచారణ కోసం రావాల్సి ఉందని చెప్పి తీసుకెళ్లారు. తర్వాత ఆయన కుటుంబీకులకు ఫోన్‌చేసి రూ.4లక్షలు ఇవ్వాలని, లేకుంటే సూర్యనారాయణరాజును చంపేస్తామని బెదిరించారు. దీనిపై సూర్యనారాయణరాజు అల్లుడు కె.శివప్రసాద్ మంగళవారం రాత్రి ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఎస్.కోట ఎస్‌ఐ ఎస్.భాస్కరరావు ఉసిరి గ్రామం వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో ఎస్.కోట వైపు వస్తున్న ఏపీ39ఎల్‌ఎస్4549, ఏపీ39సివి3522 నంబర్ల గల కార్లును ఆపారు. పోలీసులను చూసి అందులో ఉన్న వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని విచారణ జరపడంతో కిడ్నాప్ విషయం వెలుగుచూసింది. బాధితుడి జాడ తెలుసుకుని రక్షించి కుటుంబీకులకు అప్పగించారు. కిడ్నాప్ కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారు. వీరిలో ఎ1 అయిన కసిరెడ్డి రాజు విశాఖపట్నం కొమ్మాది ప్రాంతంలోని అమరావతి కాలనీకి చెందినవాడు. ఇతనికి బాధితుడితో 20 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆర్థిక అవసరాలతో కసిరెడ్డి రాజు తన ఇద్దరు కొడుకులు ప్రవీణ్‌కుమార్, సాయితో పాటు వారి స్నేహితులు మరో నలుగురి సాయంతో కిడ్నాప్‌కు పథకం రచించారు. ప్రస్తుతం పోలీసులు నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. పరారైన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కేసును ఛేదించిన ఎస్.కోట పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్పీతో పాటు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ఎన్.వి.నారాయణమూర్తి, ఎస్‌ఐ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment