No Headline
పార్వతీపురం మన్యం జిల్లా మీదుగా గంజాయి, సారా రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. పోలీసులు నలువైపులా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేసినా.. గంజాయి రవాణా చేసేవారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా.. తరలింపు మాత్రం ఆగడం లేదు. ఒడిశా సరిహద్దులోని కుగ్రామాల మీదుగా జిల్లాలోకి ప్రవేశించి ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారు. ఈ వ్యాపారంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అధికమంది పట్టుబడుతుండడం గమనార్హం.
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఎటుచూసినా ఒడిశా సరిహద్దులే ఉండటం.. చుట్టూ ప్రాంతమంతా కొండ కోనలే కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దు వెంబడి గంజాయి సులువుగా ప్రవేశిస్తోంది. అక్రమార్కులు వివిధ మార్గాలను అన్వేషించడంతోపాటు.. స్థానిక గిరిజ న యువతకూ డబ్బులు, విలువైన వస్తువులు ఆశ చూపించి గంజాయిని ఎటువంటి ఇబ్బందులూ లేకుండా బోర్డర్ దాటించేస్తున్నారు. జిల్లా మీదుగా నే ఒడిశా, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గంజాయిని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఒడిశాను ఆనుకుని పి.కోనవలస, కూనేరు, బత్తిలి, గుణుపూర్ వద్ద అంతర్‌రాష్ట్ర తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం ఉండడం లేదు. సాలూరు మండలంలో పెద్దగా తనిఖీలు లేకపోవడం, పాచిపెంట మండలం సుంకి వద్ద నుంచి ఎక్కువగా ద్విచక్ర, ఇతర వాహనాలు మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఒక వాహనాన్ని.. ఆర్మీకి చెందిన వాహనంలా తయారు చేసి మరీ గంజాయి తరలించడం గమనార్హం. ఇటీవల సరిహద్దును దాటుకొని ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యాభర్తలను తనిఖీ చేయగా.. వారి బ్యాగులో గంజాయి లభ్యమైంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
కొండల మీదుగా...
●ఒడిశాలోని మల్కన్‌గిరి మీదుగా సరిహద్దులోని బత్తిలి వైపు నుంచి భామిని మీదుగా పాలకొండ ఇతర ప్రాంతాలకు రవాణా సాగుతోంది.
●కొమరాడ మండలం కూనేరు సరిహద్దుగా ఉంది. ఈ ప్రాంతం మీదుగా అటు నుంచి గంజాయి, మద్యం.. ఇటు నుంచి బియ్యం తదితరాలు పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా జరుగుతున్నట్టు సమాచారం. అందుకే కూనేరు పోలీస్‌స్టేషన్ అధికారి పోస్టుకు మంచి డిమాండ్ ఉంటుందన్న మాటలు తరచూ వినిపిస్తాయి.
●గుమ్మలక్ష్మీపురం మండలం తాటిశీల–గొట్లభద్ర, రామన్నగూడ, కురుపాం దగ్గర మూలిగూడ, కేదారిపురం.. ఇలా మూడువైపులా ఒడిశా సరిహద్దులే ఉన్నాయి. దీంతో అక్రమంగా గంజాయి, సారా వంటివి రవాణా అవుతుంటాయి.
●పాచిపెంట, సాలూరు మండలంలోని సుంకి తదితర ఒడిశా సరిహద్దు ప్రాంతాలనూ అక్రమార్కులు వినియోగించుకుంటున్నారు.
●పార్వతీపురం మండలంలోని కొత్తవలస సమీపంలో ఒడిశా సరిహద్దు కలుస్తుంది. ఇటు నుంచి కొంతమంది తరలివస్తారు.
●గుమ్మకోట మీదుగా ఆండ్ర, మెంటాడ తదితర ప్రాంతాల నుంచి సాలూరు, పార్వతీపురం వైపు కొందరు గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం. ఇవి కాక, రైలు మార్గాలు అదనం. నిత్యం అనేక రైళ్లు ఒడిశా వైపు నుంచి వస్తుంటాయి. వీటిలో తనిఖీలు అంతంతమాత్రంగానే ఉండడంతో రవాణా పెద్ద ఎత్తున సాగిపోతోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాలవారే నిందితులు
పార్వతీపురం జిల్లాలో 2023 నుంచి ఇప్పటివరకు 450 కిలోలకుపైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో మొత్తం 28 కేసులు నమోదు కాగా.. 56 మందిని అరెస్టు చేశారు. 2019 నుంచి చూసుకుంటే, మొత్తం 147 మందిని అరెస్టు చేయగా.. ఇందులో 123 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని అదనపు ఏఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. పి.కోనవలస, ఇతర ప్రాంతాల్లో డ్రోన్, స్నిఫర్ డాగ్‌తో ప్రయోగాత్మ కంగానూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఒడిశా నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు..
అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా
స్థానిక యువతకు బహుమతులతో ఎర
తరలింపులో భాగస్వామ్యం చేస్తున్న వ్యాపారులు
నిందితుల్లో ఎక్కువగా ఒడిశా,
పశ్చిమ బెంగాల్ ప్రాంతాల వారే..
Comments
Please login to add a commentAdd a comment