అడ్డుగోడ
ఉద్యమం ఉధృతం..!
● గడప గడపకు మన ప్రభుత్వం పనులు రద్దు
● అభివృద్ధి పనులకు ప్రతీ సచివాలయానికి రూ.20లక్షల నిధులు
● తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు గత ప్రభుత్వం కృషి
● జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 1879 పనులకు 578 పనులు పూర్తి
● 1286 అభివృద్ధి పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
● గత ప్రభుత్వంపై కసితో అభివృద్ధికి తూట్లు
● బకాయిలు విడుదలలోను జాప్యం
పార్వతీపురం టౌన్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాల వారిని మోసం చేస్తూ వస్తుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పల్లె, పట్టణాల అభివృద్ధికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పనుల్లో ఒకడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎనిమిది నెలలుగా సాగాయి. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జాబితా నుంచి ఆ పేరు తొలగిపోయింది. ఫలితంగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పెండింగ్ పనులన్నీ రద్దయ్యాయి. జిల్లాలో మొత్తం 1286 పనులు రద్దు చేశారు. పూర్తయిన బిల్లుల చెల్లింపులోనూ జాప్యం జరిగింది.
జిల్లాలో జీజీఎంపీ పనుల వివరాలు
గత ప్రభుత్వ హయాంలో వార్డు, గ్రామ సచివాలయాలకు రూ.20 లక్షలు చొప్పున జిల్లాలో గల పరిధిలో గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.70 కోట్లు నిధులు సమకూర్చింది. ఇందులో 350 సచివాలయాల పరిధిలో 1879 పనులు గుర్తించారు. వాటిలో 590 పనులు ఎన్నికల నాటికి పూర్తి చేశారు. 1247 పనులు ఎన్నికల తరువాత ప్రారంభించాల్సి ఉంది. మరో 12 పనులు మద్యలో నిలిచిపోయాయి.
రూ.కోట్లలో నిధులు వెనక్కి...
గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా చేపట్టిన పనుల్లో మౌలిక సౌకర్యాలకే పెద్దపీట వేశారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉండే పనులకు నిధులు సమకూర్చితే ప్రయోజనం జరిగేది. ఆ పనులు రద్దు చేయడంతో రూ.కోట్లలో నిధులు వెనక్కి వెళ్తాయి.
పనులు రద్దయ్యాయి
గడప గడపకు మన ప్రభుత్వం నిధులు దాదాపు రద్దయ్యాయి. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కార్యాలయాలకు చేరాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చేసిన కొన్ని పనులకు నిధులు విడుదల కావాల్సి ఉంది. పూర్తి చేసిన పనులకు నిధులు విడుదల చేస్తారా.. లేదా.. అన్న ఆందోళనతో కాంట్రాక్టర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధికి బ్రేక్ పడింది.
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరైన పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. కేవలం గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తూ పనులు గుర్తించారు. ప్రతి సచివాలయానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.20 లక్షల నిధులు కేటాయించారు. ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు గుర్తించి వాటిని ప్రారంభించారు. కేవలం గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పనులు రద్దు చేశారు. ఈ నిర్ణయం అభివృద్ధికి చెంపపెట్టుగా మారింది.
– శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, పార్వతీపురం మన్యం
అభివృద్ధికి చెంపపెట్టు
కూటమి ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి చెంపపెట్టుగా మారింది. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం ఇదే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా చేపట్టిన పనుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతో గ్రామాలు, పట్టణాలకు అభివృద్ధికి దూరం చేస్తున్నారు. – అలజంగి జోగారావు,
మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం
వైఎస్సార్‌సీపీ హయాంలో పనుల పరుగు
ప్రతిపాదిత పనుల్లో గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి పనులు శరవేగంగా నిర్వహించేవారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పనులు ఎటూ తేల్చక నాన్చుడు ధోరణి అవలంబిస్తూ వచ్చింది. దీంతో పట్టణ, గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. ఎన్నికల చివర్లో చేపట్టిన 40 శాతం పనులకు బిల్లుల చెల్లింపులోనూ జాప్యం కనిపిస్తోంది. బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్లు కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టేందుకే సరిపెట్టారు. గడప గడపలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ గ్రామంలో అవసరమమ్యే పనులు గుర్తిస్తూ వాటి పరిష్కారానికి ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో కృషి చేసేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్వర నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment