![తాగున](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09krp143a-370017_mr-1739129739-0.jpg.webp?itok=wIsXUhXf)
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం: రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, ముఖ్యంగా గిరిశిఖర గ్రామాలలో తాగునీటి సమస్యను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. జల్ జీవన్ మిషన్ కింద అనేక ఆవాసాలకు తాగునీరు అందించడం జరిగిందని, మిగిలిన ఆవాసాలకు కూడా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 15 వరకు క్రాష్ ప్రోగ్రాంను నిర్వహించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. మండల పరిషత్ నిధులు రూ.75 లక్షలతో జిల్లాలోని 15 మండలాల్లో 7,217 బోర్లుకు మరమ్మతులు చేయాలన్నారు. తాగునీటి సమస్యలపై వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి ఒ.ప్రభాకరరావు మాట్లాడుతూ 187 ఆవాసాలను తాగునీటి ఎద్దడి వున్న ఆవాసాలుగా గుర్తించామని దీనికోసం మండల పరిషత్, గ్రామపంచాయతీ, జెడ్పీ నిధుల నుంచి రూ.5.16 కోట్లుతో అంచనాలు సిద్ధం చేశామన్నారు. జెడ్పీ నిధులు రూ.2.20 కోట్లతో 73 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
నేడు డీవార్మింగ్ డే
● 3,845 కేంద్రాల్లో ఏర్పాట్లు
పార్వతీపురం టౌన్: డీవార్మింగ్ డే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు పిల్లలు, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,96,612 మంది పిల్లలు, విద్యార్థులకు 3,845 కేంద్రాల్లో డీవార్మింగ్ డే కార్యక్రమం నిర్వహించి ఆల్బెండజోల్ మాత్రలు వేయిస్తున్నామని, ఇందులో 1 నుంచి 5ఏళ్లలోపు 55,234 పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో, 5 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 1,41,378 విద్యార్థులకు పాఠశాల, కళాశాలల్లో మాత్రలు వేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఏవైనా కారణాలచే ఆ రోజు ఆల్బెండజోల్ మాత్ర వేయని పిల్లలకు ఈ నెల 17న మాప్ అప్ కార్యక్రమంలో పూర్తి చేస్తామన్నారు.
నందివానివలసలో గజరాజులు
గరుగుబిల్లి: మండలంలోని నందివానివలసలో గజరాజుల గుంపు ఆదివారం ఉదయం దర్శనమిచ్చింది. కొన్నేళ్లుగా కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం మండలాలలోనే ఏనుగులు సంచరిస్తున్నాయి. కొమరాడ మండలం కళ్లికోట, విక్రంపురం, మార్కొండపుట్టి తదితర గ్రామాల మీదుగా నందివానివలస చేరుకొని తామర చెరువుకు చేరాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలలో అరటి పంటలున్నాయి. పంటలను నాశనం చేయడంతో పాటు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించి ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
నేడు అమ్మవారి హుండీల ఆదాయం లెక్కింపు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి చదురుగుడి, వనంగుడిలలో ఏర్పాటు చేసిన హుండీల ఆదాయాన్ని దేవదాయ శాఖ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో సోమవారం లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ వీవీ సూర్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తిగల భక్తులు, సేవకులు పాల్గొనవచ్చునని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో అమ్మవారి చదురుగుడి వద్ద హాజరు కావాలని కోరారు.
![తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09ppm107a-370059_mr-1739129740-1.jpg)
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
Comments
Please login to add a commentAdd a comment