![మంత్రి సంధ్యారాణి విమర్శలు సరికాదు..!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09slr22-370028_mr-1739129740-0.jpg.webp?itok=w47_RO02)
మంత్రి సంధ్యారాణి విమర్శలు సరికాదు..!
సాలూరు: రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తన స్థాయిని మరచి, అహంకారంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మండిపడ్డారు. పట్టణంలోని తన గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం, పదవులు శాశ్వతం కాదన్న విషయం సంధ్యారాణి గుర్తించాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు ఎప్పుడు చేస్తారని, ప్రజా సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారని చెప్పారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన కూటమి నేతలు తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదన్నారు. నాలుగుసార్లు ఎమ్మెలేయగా, ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవులు చేసిన తాను ఏనాడు తప్పుడు విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సంధ్యారాణి పరిష్కరించేందుకు నేడు చొరవ చూపడం లేదన్నారు. కొఠియా గ్రూపు గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తుంటే అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒడిశా అప్పటి ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌తో చర్చించి సమస్యల పరిష్కారానికి అడుగులు ముందుకు వేశారన్నారు. నేడు ఒడిశాలో కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ అధికారంలో ఉండగా కొఠియా గ్రామాల సమస్యల పరిష్కారానికి మంత్రి సంధ్యారాణి ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రశ్నించాలని ఎన్నికల సమయంలో కూటమి నేతలు చెప్పారని నేడు ఆ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే విమర్శలు చేస్తారా? అంటూ మండిపడ్డారు.
అభివృద్ధికి అడ్డుకాదు...
తాము సంక్షేమం, అభివృద్ధికి ఏనాడు అడ్డుకాదని రాజన్నదొర అన్నారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో 300 పనులు తీసుకువచ్చానని సంధ్యారాణి గొప్పలు చెబుతున్నారని అందులో సుమారు 230 పనులు గత ప్రభుత్వంలో తాను మంజూరు చేయించానని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని అవమానపరిచేలా స్థానిక సర్పంచ్‌లను పక్కనపెట్టే విధంగా కొన్ని గ్రామాల్లో కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు వల్లే పలువురు సర్పంచ్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు.
పవన్‌కల్యాణ్‌ను కించపరచడానికే ర్యాంకులు?
చంద్రబాబు ఇటీవల తన క్యాబినెట్ మంత్రులకు ఇచ్చిన ర్యాంకులు ఏ ప్రాతిపదికన ఇచ్చారో తెలియడం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు ఇచ్చిన ర్యాంకుపై ఆయన స్పందిస్తూ, పలు శాఖలు చూస్తున్న పవన్‌కళ్యాణ్‌ను ఒక శాఖ మాత్రమే చూస్తున్న మంత్రులతో ఎలా పోల్చారో అర్ధం కావడం లేదన్నారు. పవన్‌కల్యాణ్‌ను కించపరచడానికే ఈ ర్యాంకులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అధికారం శాశ్వతం కాదు..
హామీలను అమలు చేయమంటే విమర్శలు చేస్తారా?
మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర
Comments
Please login to add a commentAdd a comment