ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 25 సీట్లకు 25 అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు వస్తాయని టైమ్స్ నౌ, ఈటీజీ సర్వే వెల్లడించడం అత్యంత ఆసక్తికరంగా ఉంది. కొన్నాళ్ల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు చోట్ల ప్రతిపక్ష తెలుగుదేశం గెలవగానే ఇంకేముంది.. మొత్తం పరిస్థితి మారిపోయింది.. ఇక మనం అధికారంలోకి రావడమే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన పార్టీవారు కాని చాలా హడావుడి చేశారు. కౌన్సిల్ ఎన్నికలకు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని ఎందరు విశ్లేషించినా, టీడీపీ మద్దతుదారులు మాత్రం దానిని పట్టించుకోకుండా ప్రజలను మభ్య పెట్టడానికి విశేష యత్నం చేస్తున్నారు.
చంద్రబాబు వంటి సీనియర్ నేతకు ఆ సంగతి తెలియకపోదు. కాని ఆయన కావాలని ప్రజలను తప్పుదారి పట్టించి, టీడీపీ ఏదో గెలిచిపోతోందన్న భావన కలిగించడానికి తంటాలు పడుతుంటారు. కాని ఇప్పుడు ఆంగ్ల మాధ్యమానికి చెందిన టైమ్స్ నౌ న్యూస్ చానల్ చేసిన ఈ సర్వే టీడీపీ వారికి చాలా నిరాశ మిగుల్చుతుంది. ముఖ్యమంత్రి , వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నట్లుగా వై నాట్ 175 అన్న చందంగానే దాదాపు మొత్తం లోక్ సభ సీట్లు గెలుచుకునే పరిస్థితి ఏర్పడితే ప్రతిపక్షానికి స్థానం లేనట్లే కదా! గతంలో వచ్చిన కొన్ని సర్వేలలో ఆరేడు సీట్ల వరకు టీడీపీకి రావచ్చని జాతీయ సర్వేలు అంచనా వేసేవి.
కాని ఈసారి మాత్రం టీడీపీకి సున్నా లేదా ఒక సీటు అంటే గతంలో ఉన్నవాటికంటే తక్కువ అన్నమాట. ఇంతకుముందు 2019లో మూడు లోక్ సభ స్థానాలను మాత్రమే టిడిపి గెలుచుకుంది. ఈ సర్వే పూర్తిగా నిజమైతే పార్లమెంటులో మొదటిసారిగా టీడీపీకి అసలు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. లోక్ సభలో ఒక్క సీటు గెలవకపోతే దిగువ సభలో టీడీపీ ఉనికి ఉండదు. అలాగే రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీకి ఒకరే ఎంపిగా ఉన్నారు. ఆయన కాలపరిమితి వచ్చే ఏడాది ముగుస్తుంది.
అసెంబ్లీ ఎన్నికలలో గతసారి మాదిరే ఇరవై, ముప్పై సీట్లే వస్తే, అప్పుడు కూడా రాజ్యసభలో స్థానం దక్కే అవకాశం ఉండదు. ఇది సహజంగానే టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే. టీడీపీతో పాటు ఆ పార్టీని భుజాన వేసుకుని కంటికి రెప్పలా కాపాడుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలకు కలవరం కలిగిస్తుంది. ఎలాగొలా టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలని విశ్వయత్నం చేస్తూ, నిత్యం అబద్దాలు వండి వార్చుతున్న వారికి ఈ పరిణామం తీవ్ర ఆశాభంగమే అవుతుంది. ఈ సర్వే మరో సంకేతాన్ని కూడా ఇస్తోంది.
మీడియా సంస్థల వల్లే రాజకీయ పార్టీల గెలుపు ఓటములు ఉండబోవని సర్వే స్పష్టం చేస్తోంది. రాజకీయ వర్గాలలో ఒక ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా సొంతంగా కొన్ని సర్వేలు చేయించుకుంటే వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంచనాలు వస్తున్నాయట. దాంతోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ వ్యూహం అవలంబించాలో అర్ధంకాక సతమతమవుతున్నారట. అందుకే ఆయనకు ఉండే అలవాటు ప్రకారం ఎదుటి పార్టీ నేతలను ముఖ్యంగా అధినేతను వ్యక్తిగతంగా బదనాం చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. ముఖ్యమంత్రి జగన్‌పై నిత్యం దూషణలకు దిగుతున్నారు.
అదంతా ప్రస్టేషన్ వల్లేనని చాలామంది భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అందరిని కోటీశ్వరులను చేస్తా.. ఇంటికో ఉద్యోగం ఇస్తా.. అంటూ ఊకదంపుడు వాగ్దానాలను ప్రజలు నమ్మడం లేదు. అది ఆయనకు పెద్ద మైనస్ అవుతోంది. తత్పలితంగానే వైసీపీలోని వ్యక్తులను టార్గెట్ చేసుకుని, ఆయా వ్యవస్థలను ప్రభావితం చేయడం ద్వారా ఏమైనా గిట్టుబాటు అవుతుందా అన్న ఆలోచన సాగిస్తున్నారు. కాని దానివల్ల టీడీపీకి ఏమీ పాజిటివ్ అవడం లేదని ఈ తాజా సర్వే చెబుతోంది.
ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లోబరచుకుని పొత్తు పెట్టుకోవాలని గట్టి యత్నం చేస్తున్నారు. పవన్ కూడా చంద్రబాబు చెప్పినట్లు చేయడానికి సిద్దపడుతూనే ఉన్నారు. అయితే ఒకవైపు బీజేపీతో పొత్తు వదలుకోవడం ఎలా అన్నదానిపై పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు.ఇంకో వైపు జనసేన హార్డ్ కోర్ అభిమానులు టీడీపీతో పొత్తు అంటే కొన్ని నిర్దిష్ట షరతులు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఉదాహరణకు కాపు సంక్షేమ సమితి నేత అయిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఒక ప్రకటన చేస్తూ శాసనసభ సీట్లను టీడీపీ, జనసేన చెరిసగం పంచుకుని పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్
ఒక వేళ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని పవన్, చంద్రబాబు ఇద్దరు చెరో రెండున్నరేళ్లు నిర్వహించేలా ఒప్పందం ఉండాలని ఆయన చెబుతున్నారు. అలా చేయకుండా చంద్రబాబుకే మొత్తం టరమ్ అంతా సీఎం పదవి అని ఒప్పుకుంటే, పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారని వైసీపీ ప్రచారం చేస్తుందని, దాని వల్ల చాలా నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జోగయ్య వంటి పవన్ అభిమానులు చాలా ఎక్కువ మంది ఇలాగే ఫీల్ అవుతున్నారు.
అందులోను పవన్ అంటే ఒక అపనమ్మకం ఉండడం, చంద్రబాబు సన్నిహితుడైన ఒక మీడియా అధిపతి పవన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారని ప్రచారం చేయడంతో బాగా డామేజీ అయ్యారు. చంద్రబాబును పూర్తిగా నమ్మితే ప్రమాదమేనన్న భావన జనసేనలో లేకపోలేదు. పవన్ కూడా బీజేపీని వీడలేక, టీడీపీని కలవలేక టెన్షన్ లో ఉన్నారని చెబుతున్నారు. దానికి తగ్గట్లు ఇప్పుడు ఈ తాజా సర్వే టీడీపీ, జనసేనలకు పుండుమీద కారం చల్లినట్లయింది. ఈ సర్వే మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్‌లో ఆత్మ విశ్వాసం మరింత పెంచుతుంది. అదే సమయంలో చంద్రబాబు, పవన్‌ల ఆత్మ స్థైర్యం బాగా దెబ్బతింటుంది.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment