కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య
భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత
చార్మినార్ (హైదరాబాద్): ఒవైసీ లాపతా.. జబ్ సే ఆయీ మాధవీ లతా.. (మాధవీ లత వచ్చి నప్పటి నుంచి ఒవైసీ కనిపించడం లేదు) అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించా రు. మాధవీ లత హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అనగానే సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. బుధవారం మాధవీ లత చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించి తన నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బీజేపీ నేతలతో కలిసి చార్మినార్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమెతోపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో అధికారం చెలాయిస్తున్న మజ్లిస్ పార్టీ పాతబస్తీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్‌గాంధీలు ఔరంగజేబు యూనివర్సిటీలో చదివారని.. వారిద్దరి ఆలోచనలు ఒకేతీరుగా ఉంటాయన్నారు. మజ్లిస్‌తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నందునే ఇప్పటివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించ లేదని దుయ్యబట్టారు. పాతబస్తీలో మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్న మజ్లిస్‌కు ఈసారి ఓటమి తప్పదన్నారు. చార్మినార్ నుంచి బయలుదేరిన ప్రచార ర్యాలీ మదీనా, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, మోజంజాహీ మార్కెట్, నాంపల్లి ద్వారా లక్డీకాపూల్ వరకు సాగింది.
Comments
Please login to add a commentAdd a comment