ఎన్నికల ముందు అభయహస్తం..ఎన్నికలయ్యాక  భస్మాసుర హస్తం | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందు అభయహస్తం..ఎన్నికలయ్యాక  భస్మాసుర హస్తం

Published Sun, Apr 28 2024 4:32 AM

BRS Working President KTR Chitchat at Telangana Bhavan

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చిట్‌చాట్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలోనూ మాట తప్పారు 

ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల కోసం ఆపద మొక్కులు, దేవుళ్లపై ఒట్లు 

అసెంబ్లీ ఎన్నికల నాటిలా ప్రజలు ఇప్పుడు మోసపోవద్దు 

బీజేపీని అడ్డుకునేది ప్రాంతీయ పార్టీ లే.. 

కేంద్రంలో కాంగ్రెస్‌ వచ్చేది లేదని వ్యాఖ్య 

ఏపీలో వైఎస్‌ జగన్‌ మళ్లీ గెలుస్తున్నారన్న సమాచారం తమకు ఉందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే గెలవలేరని.. పరువు పోతుందనే పాలమూరు ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకొన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావు విమర్శించా రు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభయ హస్తం అని కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం చేసిందని.. ఎన్నికలయ్యాక అది భస్మా సుర హస్తంగా మారిందని మండిపడ్డారు.

రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ఈ విషయాన్ని తాను 20 సార్లు చెప్పినా రేవంత్‌ ఖండించలేదని గుర్తించాలన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పెరిగిందని.. కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు లేని కేసీఆర్‌ పాలనే తిరిగి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. 

ప్రభుత్వం చెప్పిన పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా లబి్ధదారుల ఖాతాలో చేరలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. తర్వాత మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రూ.4 వేల పెన్షన్, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రైతు భరోసా, స్కూటీలు, నిరుద్యోగ భృతి, క్వింటల్‌ ధాన్యానికి రూ.500 బోనస్‌ వంటివేవీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అటకెక్కిస్తారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 250 రోజులైనా చేయడం లేదు. దీనిపై హరీశ్‌రావు చేసిన సవాల్‌కు రేవంత్‌ సమాధానం చెప్పాలి. మాదిగ సామాజిక వర్గంతోపాటు మంత్రి పదవి దక్కని ముదిరాజ్‌ సోదరులు, ఎంపీ సీటు దక్కని గౌడ, యాదవ సోదరులు కాంగ్రెస్‌ను ఓడించాలని భావిస్తున్నారు. 

హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌కు పూర్తి మద్దతునిచ్చింది 
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం పూర్తిగా బీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చింది. ఉద్యమకారులు గొప్ప పరిపాలకులు కాలేరని బీజేపీ దివంగత నేత అరుణ్‌ జైట్లీ అన్నారు. కానీ అది తప్పు అని కేసీఆర్‌ నిరూపించారు, 14 ఏళ్లు ఉద్యమ పార్టీని నడపడం, తర్వాత పదేళ్లు ప్రభుత్వంలో కొనసాగడం, ఒక పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయమేమీ కాదు. 

లోక్‌సభ ఎన్నికల్లో 10–12 సీట్లలో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి పనులు చేయిస్తాం. రేవంత్‌కు మైనారిటీలను గౌరవించే సంస్కారం లేదు. ఒక్క మంత్రిపదవి కూడా ఇవ్వలేదు. రేవంత్‌ ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు? మోదీ నాయకత్వంలోనా? రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనా? 

చోటా భాయ్‌.. బడే భాయ్‌.. ఇద్దరూ మోసగాళ్లే.. 
చోటాభాయ్‌ సీఎం రేవంత్, బడే భాయ్‌ ప్రధాని మోదీ ఇద్దరూ మోసగాళ్లే. మోదీ తెలంగాణ ఏర్పాటునే తప్పుపడుతూ మాట్లాడారు. మోదీ, రేవంత్‌రెడ్డిల మోసాలను చూశాక ప్రజలు కేసీఆర్‌ పాలనే కావాలని కోరుకుంటున్నారు. ప్రధాని మోదీని ఉత్తర భారత ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. బీజేపీని అడ్డుకునేవి ప్రాంతీయ పార్టీలే. కాంగ్రెస్‌ కాదు. తమిళనాడు సహా చాలా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీ లే మోదీని అడ్డుకుంటున్నాయి. ఏపీలోనూ ప్రాంతీయ పార్టీ లే గెలవాలని కోరుకుంటున్నాం. అక్కడ వైఎస్‌ జగన్‌ మరోసారి విజయం సాధించబోతున్నారని మాకు సమాచారముంది. 

బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు.. 
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ గెలవకుండా బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు అయ్యాయి. రేవంత్‌ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి సహకరించేందుకే కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టింది. కొందరు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఆ నియోజకవర్గాలతో సంబంధమే లేదు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తిప్పికొట్టాలి.

ప్రజలను మోసగించే ఎత్తుగడ 
‘‘రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేస్తూ.. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానంటూ.. ప్రజలను మరోసారి మోసగించే ఎత్తుగడ వేస్తున్నారు. అసలు రేవంత్‌రెడ్డికి మాట నిలుపుకొన్న చరిత్ర లేదు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు. ఏమైంది? జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కలు మొక్కుతున్నారు. దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపోయిన ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దు.’’     – కేటీఆర్‌ 

పార్టీ కి పూర్వవైభవం తెస్తాం.. 
వరంగల్‌లో రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి ఎవరు ప్రచారం చేసినా కడియం శ్రీహరి, ఆయన కూతురు మూడో స్థానానికి వెళ్లడం గ్యారంటీ. కేసీఆర్‌కు కడియం చేసిన ద్రోహం మామూలుది కాదు. మల్కాజిగిరిలో ఈటల గెలుస్తారని మాజీ మంత్రి మల్లారెడ్డి చేసినవి వ్యంగ్య వ్యాఖ్యలే. బీఆర్‌ఎస్‌ నుంచి కొందరు నాయకులు వెళ్లిపోయినా.. కార్యకర్తలు ఎక్కడికీ వెళ్లలేదు. పార్టీని విస్తరిస్తాం, పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నిస్తాం..’’అని కేటీఆర్‌ చెప్పారు.

ప్రతికూలతలను తట్టుకుని కేసీఆర్‌ రాష్ట్రాన్ని సాధించారు 
బీఆర్‌ఎస్‌ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం తెలంగాణ భవన్‌తో పాటు అన్ని జిల్లా కార్యాలయాల్లోనూ పార్టీ జెండాను ఎగురవేసి జరుపుకొన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2001లో శూన్యంలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ పార్టీని ఏర్పాటు చేసి.. ప్రతికూలతలను తట్టుకుని రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపించి, ప్రజాస్వామ్యయుతంగా అన్ని రాజకీయ పార్టీ లను కలుపుకొని దశాబ్దాల కలను సాకారం చేశారని తెలిపారు. ప్రజలందించిన సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. 

ఆనాడు సమైక్యవాదులు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఛేదించుకుని విజయాన్ని చేరుకున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. అనంతరం తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేసినట్లు తెలిపారు. తెలంగాణ సాధించిన ప్రగతిని దేశవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చినట్లు తెలిపారు. దీనికి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషాల నుంచి అద్భుత స్పందన లభించిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అపజయాలకు కుంగిపోయేది లేదని భవిష్యత్తులోనూ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్‌ అలీ, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement