రేవంత్‌కి ఓటమి భయం పట్టుకుంది | Sakshi
Sakshi News home page

రేవంత్‌కి ఓటమి భయం పట్టుకుంది

Published Sun, Apr 28 2024 4:39 AM

Former Minister Harish Rao comments over revanth reddy

ఆ అసహనంతోనే తిట్ల దండకాన్ని అందుకున్నారు 

నాడు ఓటుకు కోట్లు అయితే.. నేడు ఓటుకు ఒట్టు  

కొత్త జిల్లాల రద్దుకు సీఎం కుట్ర  

బీజేపీ, కాంగ్రెస్‌వి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలు 

హామీలు అమలయ్యే వరకు నిలదీస్తా  

మాజీమంత్రి హరీశ్‌రావు

కరీంనగర్, సిద్దిపేటజోన్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతే సీఎం పదవి నుంచి దింపేస్తారనే భయం రేవంత్‌రెడ్డికి పట్టుకుందని, అందుకే ఇచ్చిన హామీలు, పరిపాలనపై మాట్లాడాల్సిన ఆయన అసహనంతో తిట్ల దండకాన్ని అందుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శనివారం కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యాయని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే ప్రధాని మోదీని సీఎం బడేబాయి అంటున్నారని, రేవంత్‌రెడ్డి ఓ ఫైటర్‌ అని బండి సంజయ్‌ పొగుడుతున్నారని, రేవంత్‌రెడ్డి బీజేపీలోకి రావాలని ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి ఎవరు బీ టీమ్‌నో అర్థం అవుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ దోస్తీకు బోలెడు కారణాలు ఉన్నాయని, కరీంనగర్‌తోపాటు అనేక సీట్లలో కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందన్నారు.  

నన్ను తిట్టినా ఫర్వాలేదు.. హామీలు అమలు చేయండి: హరీశ్‌ 
‘‘నేను కొత్త డిమాండ్లను అమలు చేయమని అనలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడుగుతున్నా. దానికి మీరు. మీ మంత్రులు నన్ను తిడుతున్నారు. నన్ను ఎంత తిట్టినా, ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా.. హామీలు అమలయ్యే వరకు అడుగడుగునా నిలదీస్తా’’అని హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నాడు ఓటుకు నోటు అయితే.. నేడు ఓటుకు ఒట్టు అని ఎద్దేవా చేశారు. సీఎం సవాల్‌ మేరకు అమరవీరుల స్తూపం వద్దకు తాను రాజీనామాతో వస్తే రేవంత్‌ మొఖం చాటేశారని విమర్శించారు. రాజీనామా ఎలా చేయాలో తనకు తెలుసని, పదవులు ముఖ్యం కాదని, ప్రజా ఆకాంక్షలే ముఖ్యమని పేర్కొన్నారు.

గతంలో వచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరితే రేవంత్‌రెడ్డి జిరాక్స్‌ కాగితం ఇచ్చి మోసం చేసి పారిపోయారని విమర్శించారు. అప్పట్లో కిషన్‌రెడ్డి రాజీనామా చేయలేదని అలాంటి వారు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అధ్యక్షులు అని మండిపడ్డారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని, లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లా సరిపోతుందంటూ అందుకు కమిషన్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని హరీశ్‌ ఆరోపించారు.  

Advertisement
Advertisement