కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ ఆసక్తికరమైన సంగతి చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీట్లను తగ్గించుకుని త్యాగం చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ ఆయనతో చెప్పి బాధపడ్డారట. అయినా పొత్తు ధర్మం కోసం, రాష్ట్రం కోసం తమ సీట్లను తగ్గించుకోవలసి వచ్చిందని ఆయన చెప్పారు. నిజంగా పవన్ ఈ మాట చెప్పి ఉంటే రాజకీయాలలో ఇంతకన్నా బానిసత్వం ఇంకొకటి ఉండదు. ఒకవైపు జనసేన కార్యకర్తలు తమకు కనీసం నలభై అసెంబ్లీ సీట్లు అయినా పొత్తులోభాగంగా కేటాయించలేదని బాధ పడుతుంటే, పుండుమీద కారం చల్లినట్లు పవన్ కల్యాణ్ తమకు ఇచ్చినవే ఎక్కువని బాధపడ్డారా?. ఈ విషయం విన్న జనసైనికులకు ఏమనిపిస్తుంది! పేరుకు జనసేన తప్ప, తమది టీడీపీ భజన సేన అని అనుకోరా!
తొలుత జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. బీజేపీకి ఇవ్వడం కోసం మరో మూడు తగ్గించుకున్నారు. పోనీ ఆ ఇరవై ఒక్కటి అన్నా జనసేన వారికి ఇచ్చారా అంటే అలా చేయలేదు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ వంటి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి కొన్ని సీట్లు ఇచ్చేశారు. మూడు ఎంపీ సీట్లు ఇస్తారని అనుకున్నారు. దానిని పవన్ కల్యాణ్ మూడుకు తగ్గించుకున్నారు. పైగా ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిని అని ఆయన నిస్సిగ్గుగా చెప్పి జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన సంగతులు ఏమిటంటే ఏళ్ల తరబడి జనసేన ముఖ్య నేతలనే పవన్ కల్యాణ్ త్యాగం చేశారు.
అందులో స్వయంగా ఆయన సోదరుడు నాగబాబు కూడా ఉండడం విశేషం. నాగబాబుకు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇస్తారని భావించారు. ఏమైందో తెలియదు కాని అనకాపల్లిని బీజేపీకి త్యాగం చేశారు. అందులో కూడా ఎవరు పోటీచేశారో తెలుసు కదా! సీఎం రమేష్ కు. ఆయన ఎవరో కూడా తెలుసు కదా! టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేత. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. బీజేపీలో చేరినా కాంగ్రెస్ కు ముప్పై కోట్ల విరాళం ఇచ్చిన ప్రముఖుడు.ఈ మధ్యనే 400 కోట్ల ఫోర్జరీ కేసు కూడా ఆయనపై నమోదు అయింది. ఇతరత్రా ఉన్న ఆరోపణలు చెబితే చాంతాడు అంత అవుతాయి .సీఎం రమేష్ కోసం తన సోదరుడినే బలి చేశారంటే ఏదో పెద్ద విషయమే ఉండి ఉండాలన్నది పలువురి అబిప్రాయంగా ఉంది. పవన్ ఈ రకంగా అనకాపల్లి సీటును అమ్మేశారని జనసేన కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే మరో సీటును వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన బాలశౌరికి ఇచ్చారు. ఆయనకు వైఎస్సార్‌సీపీ టిక్కెట్ రాలేదు. దాంతో పవన్ కల్యాణ్ ఆ సీటును ఆయనకు అమ్మి ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో జనసేనకు నేతలే లేరా? అంటే ఉన్నారు. 2019లో జనసేన పక్షాన పోటీచేసి ఓడిపోయిన పార్లమెంటు అభ్యర్ది ఉన్నారు. అలాగే అసెంబ్లీకి పోటీచేసిన అబ్యర్దులు ఉన్నారు. కాని వారెవ్వరిని కాదని బాలశౌరికి ఇవ్వడంలో ఉన్న మతలబు ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అసెంబ్లీ టిక్కెట్ల విషయానికి వస్తే భీమవరంలో టీడీపీ నేతగా ఉన్న పి.రామాంజనేయులును జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. అక్కడ జనసేన కోసం పనిచేసిన కొందరు ప్రముఖులు ఉన్నారు. వారినెవ్వరిని కాదని ఈయనకు ఎందుకు ఇచ్చారు! లోగుట్టు పెరుమాళ్ల కెరుక. విజయవాడ పశ్చిమలో పార్టీకోసం పోతిన మహేష్ అనే నేత విశేషంగా కృషి చేశారు. ఆయన కు టిక్కెట్ వస్తుందని అంతా భావించారు. కాని ఆశ్చర్యంగా అక్కడ బలం లేని బీజేపీకి టిక్కెట్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. అది త్యాగమా?లేక మంచి బేరమో తెలియదు కాని బీజేపీ పక్షాన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీకిగాను జనసేన నేతను బలి చేయడానికి పవన్ కల్యాణ్ వెనుకాడలేదు. సుజనా చౌదరి అత్యంత ధనికులలో ఒకరు. బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగవేశారన్న కేసులు ఎదుర్కుంటున్న నేత. తాను నిజాయితీపరుడనని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆచరణలో ఇలా చేసేసరికి ఆయనలో నిజాయితీ అన్నది నేతిబీరకాయలో నెయ్యి వంటిదని జనసైనికులు భావించే పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపధ్యంలోనే పోతిన మహేష్ తీవ్ర స్థాయిలో పవన్ పై విరుచుకుపడ్డారు. ఇంతకాలం పార్టీ కోసం పని చేస్తే నమ్మించి గొంతు కోశారని ఆయన బాధపడ్డారు. జనసేన ప్లెక్సీలు, జండాలను ఆయన అనుచరులు దగ్దం చేశారు. మహేష్ మీడియా సమావేశం పెట్టి పవన్ ను ఏకీపారేశారు.ఇది ప్రజారాజ్యం -2 అని , మరో ఏడాది తర్వాత ఈ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత డెబ్బై రెండేళ్ల ఎన్నికల చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరపున కమ్మ సామాజికవర్గం నేత ఎవరూ పోటీ చేయలేదు. అక్కడ నివసించేవారిలో అత్యధికులు ముస్లింలు, నగరాలు,వైశ్యులు తదితర వర్గాల వారు ఉన్నారు. కాని ఈసారి సుజనా చౌదరి పోటీచేస్తున్నారు. బీజేపీ కూడా ఒరిజినల్ పార్టీ నేతలకు కాకుండా సుజనా వంటివారికే ఎక్కువ సీట్లు కట్టబెట్టడం కూడా విమర్శలకు దారి తీసింది.అవినీతిపై బోలెడు సోది కబుర్లు చెప్పే పవన్ కల్యాణ్ ఈ విధంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారి కోసం తన పార్టీవారిని బలి చేశారంటేనే ఆయన తత్వం అందరికి తెలిసిపోయింది. ఈ విషయాలన్నిటిని పోతిన మహేష్ ప్రస్తావించి అనేక ప్రశ్నలు సందించారు.పలు కొత్త విషయాలు వెల్లడించారు. 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ కనీసం పాతిక సీట్లు కూడా పోటీ చేయలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్ నిజ స్వరూపం తెలుసుకోవాలని, ఆయన మేడిపండు వంటివారు అని మహేష్ తీవ్రంగా ద్వజమెత్తారు. కన్నతల్లిని దూషించిన బినామీ చానల్ కు యజమాని అయిన వ్యక్తికి బీజేపీ టిక్కెట్ ఇస్తే పవన్ ఎలా మద్దతు ఇచ్చారని అని అడిగారు. మొత్తం 21 జనసేన సీట్లలో ఏడుగురే పార్టీ వారని, మిగిలినవారంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని ఆయన తేల్చి చెప్పారు. కమ్మవారికోసం బిసిలను బలి చేస్తారా అని మహేష్ ప్రశ్నించారు.ఆయన అడిగినవాటికి పవన్ కల్యాణ్ వద్ద జవాబులు లేవనే చెప్పాలి. చివరికి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తీసుకున్న ఇంటి గృహ ప్రవేశానికి భార్య అన్నాలెజెవోను తీసుకు రావాలని మహేష్ అనడం సంచలనంగా ఉంది. అందరూ ఆ సక్తిగా ఈ విషయాన్ని గమనిచంచారు. ఏమైందో తెలియదు కాని, పవన్ కల్యాణ్ తన భార్య లేకుండానే గృహ ప్రవేశం చేశారు. దీంతో రకరకాల ఊహాగానాలకు పవన్ కల్యాణ్ అవకాశం ఇచ్చారు. ఏది ఏమైనా జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టి పూర్తిగా అప్రతిష్టపాలయ్యారని చెప్పాలి. నిజంగానే మహేష్ అన్నట్లు టీడీపీకి బి బ్యాచ్ గా తయారై వారికోసం పనిచేయడానికి జనసేనను పెట్టడం ప్రజలను మోసం చేయడానికే అన్న భావన వస్తుంది.
మరికొన్ని ఉదాహరణలు కూడా చెప్పాలి. అవనిగడ్డ నుంచి టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్ ను పార్టీలో చేర్చుకుని జనసేన టిక్కెట్ ఇచ్చారు. పాలకొండ నియోజకవర్గంలో కూడా అదే ప్రకారం నిమ్మక జయకృష్ణను టీడీపీ నుంచి తీసుకుని టిక్కెట్ ఇచ్చారు. తణుకు లో తమ పార్టీ నేత ఒకరికి టిక్కెట్ ప్రకటించి, తదుపరి ఆ సీటును టీడీపీకి వదలివేశారు. అంటే చంద్రబాబు ఏమి చెబితే అది చేశారని అర్ధం అవుతుంది.తణుకు లో కూటమి సభ పెట్టినప్పుడు తణుకు నేత రామచంద్రరావు వర్గీయులు నిరసన కూడా తెలిపారు. ఇంత జరిగినా చంద్రబాబు దృష్టిలో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించినట్లేనట.ఆ మాటను పవన్ కల్యాణ్ అన్నారని చెబుతున్నారు. ఇంతకన్నా పరువు తక్కువ ఏమన్నా ఉందా! పిఠాపురంలో తన గెలుపుకోసం టీడీపీ నేత వర్మ కాళ్లా,వేళ్లా పడడం చూసి జనసేన కార్యకర్తలను సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం రాజకీయం అంతా చంద్రబాబు కోసం చేస్తున్నారని తేలిపోతుంది. పోనీ తనను ఎంతో కొంత ఆదరించిన కాపు సామాజికవర్గానికి అయినా న్యాయం చేశారా అంటే అదీ లేదు. కేవలం వారి ఓట్లు పొంది చంద్రబాబుకు మేలు చేయడానికే ఈ పొత్తు పెట్టుకున్నారని స్పష్టమవుతోంది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment