గన్స్‌ & కార్స్‌ | Our leaders have foreign vehicles and guns | Sakshi
Sakshi News home page

గన్స్‌ & కార్స్‌

Published Thu, Nov 16 2023 3:53 AM | Last Updated on Thu, Nov 16 2023 10:30 AM

Our leaders have foreign vehicles and guns - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సొంతకారు కూడా లేని సీఎం కేసీఆర్, మంత్రులు మల్లారెడ్డి, సబిత, ఎమ్మెల్యేదానం నాగేందర్‌ వంటి వారు ఒకవైపు... లగ్జరీ కార్లు, అత్యాధునిక ఆయుధాలున్న హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అక్బరుద్దీన్, శ్రీలతారెడ్డి వంటి అభ్యర్థులు మరోవైపు.  ఆత్మరక్షణ కోసమో, ఫ్యాషనో, వారసత్వమో కారణమేదైనా పలువురు రాజకీయ నాయకుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు .22 పిస్టల్‌ వారసత్వంగా రాగా.. యాకుత్‌పుర బరిలో ఉన్న జాఫర్‌ అమెరికా కంపెనీ నుంచి తుపాకులు కొనుగోలు చేశారు.

జూబ్లీహిల్స్‌ అభ్యర్థి అజారుద్దీన్‌ ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్స్‌ కారులో చక్కర్లు కొడుతుండగా.. హుజూర్‌నగర్‌ బరిలో ఉన్న శ్రీలతారెడ్డికి 1.38 కోట్ల ఖరీదైన ఐదు లగ్జరీ కార్లున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి టెక్సాస్‌ నుంచి టెస్లా, ల్యాండ్‌ రోవర్‌ కార్లు దిగుమతి చేసుకున్నారు. వీరంతా ఆయా వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచారు.  

విదేశాల నుంచి గన్స్‌ దిగుమతి.. 
యాకుత్‌పుర నుంచి పోటీ చేస్తున్న జాఫర్‌ హుస్సేన్ మిరాజ్‌ అమెరికాకు చెందిన ప్రముఖ ఆయుధాల తయారీ సంస్థ స్మిత్, వెస్సన్‌ బ్రాండ్‌ తుపాకులు కొనుగోలు చేశారు. రూ.2 లక్షలు ఖరీదైన 32 బోర్‌ రివాల్వర్, .32 పిస్టల్‌ రాఫ్టర్‌ ఈయన వద్ద ఉన్నాయి. రూ.19.50 లక్షల విలువైన ఆడి క్యూ3 కార్‌ కూడా ఉంది.

మలక్‌పేట అభ్యర్థి అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల వద్ద రూ.లక్ష విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన 12 బోర్‌ గన్‌లు ఉన్నాయి. బలాలకు రూ.26.69 లక్షలు ఖరీదైన ఇన్నోవా, అర్బన్‌ క్రూయిజర్‌ వాహనాలున్నాయి. బలాలకు  షహనాజ్‌ సుల్తానా, తాహేరా ఫర్హా, సనా సుమేరా ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరి పేర్ల మీద రూ.59 లక్షలు విలువ చేసే హోండా బీఆర్‌వీ, టొయోటా ఫార్చ్యూనర్‌ కార్లున్నాయి. 

హరీశ్‌ వర్సెస్‌ రేవంత్‌.. 
రాజకీయ క్షేత్రంలోనే కాదు ఆయు« దాల విషయంలోనూ హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశరావుకు రూ.1.30 లక్షలు విలువ చేసే .32 ఎన్‌పీ బోర్‌ పిస్టల్‌ ఉండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వద్ద రూ.2 లక్షలు విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన రైఫిల్‌ ఉన్నాయి. రేవంత్‌ పేరు మీద సెకండ్‌ హ్యాండ్‌ మెర్సిడెస్‌ బెంజ్‌తో పాటు హోండా సిటీ కార్లు కూడా ఉన్నాయి. 

ఎస్‌బీబీఎల్‌ పంప్‌ యాక్షన్‌ గన్‌ 
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వద్ద రూ.లక్ష విలువ చేసే రివాల్వర్, రూ.60 వేలు విలువ చేసే 12 బోర్‌ సింగిల్‌ బ్యారెల్‌ బ్రీచ్‌ లోడింగ్‌ (ఎస్‌బీబీఎల్‌) పంప్‌ యాక్షన్‌ గన్‌ ఉంది. ఆయన భార్య శారద పేరు మీద వోల్వో ఎక్స్‌సీ 90 కారు ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ కారు విలువ రూ.71.82 లక్షలు. ఉప్పల్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డి వద్ద రూ.1.50 లక్షలు విలువ చేసే రివాల్వర్‌తోపాటు రూ.70.82 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ 530డీ స్పోర్ట్‌ లగ్జరీ కారు, రూ.34.92 లక్షల ఖరీదైన ఫార్చ్యూనర్‌ ఉన్నాయి. 

సలావుద్దీన్‌ ఒవైసీ నుంచి..
గతంలో హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వద్ద వారసత్వంగా వచ్చిన ఆయుధాలు, కార్లున్నాయి.  ప్రధానంగా కుటుంబ సెంటిమెంట్‌గా భావించే .22 పిస్టల్‌ ఉంది. దీని విలువ రూ.20 వేలు. దీంతో పాటు వేట కోసం వినియోగించే 30–06 స్ప్రింగ్‌ ఫీల్డ్‌ రైఫిల్‌ ఉంది. దీన్ని 1996లో రూ.20 వేలతో కొనుగోలు చేశారు.

 2016లో రూ.11,450తో కొనుగోలు చేసిన 12 బోర్‌ డబుల్‌ బ్యారెల్‌ బ్రీచ్‌ లోడింగ్‌ (డీబీబీఎల్‌) గన్   కూడా ఉంది. తండ్రి సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ నుంచి బహుమతిగా వచ్చిన జీపు కారు కూడా ఉంది. దీంతో పాటు 2007లో జిప్సీ కారు, 2005లో రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన డ్యుకాటీ 900 ఎస్‌ఎస్‌ మోటార్‌ సైకిల్స్‌ కూడా అక్బరుద్దీన్‌ పేరు మీద ఉన్నాయి. ఈయన భార్య సాబీనా ఫర్జానా పేరు మీద మహీంద్రా స్కార్పియో వీఎల్‌ఎక్స్‌ వాహనం ఉంది. దీని విలువ రూ.12.95 లక్షలు. 

స్పోర్ట్స్‌ కారులో అజార్, టెస్లాలో శ్రీలత 
మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ వద్ద రూ.71.89 లక్షలు ఖరీదైన ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్స్, రూ.28 లక్షలు విలువైన హోండా సీఆర్‌–వీ కార్లున్నాయి. హుజూర్‌నగర్‌ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.1.38 కోట్ల విలువ చేసే ఐదు లగ్జరీ కార్లున్నాయి.

రూ.62.63 లక్షల విలువ చేసే టెస్లా కారుతో సహా రూ.29.15 లక్షల హ్యుందాయ్‌ టక్సన్, రూ.36 లక్షల ఖరీదైన ఇన్నోవా క్రిస్టా, వెంటోతో పాటు రూ.11 లక్షల విలువైన మారుతీ బాలెనో కార్లున్నాయి. ఆదిలాబాద్‌ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి వద్ద 2021 మోడల్‌ టెస్లా కారు ఉంది. దీని విలువ రూ.51.75 లక్షలు. రూ.18.16 లక్షల విలువైన 2016 మోడల్‌ ల్యాండ్‌ రోవర్‌ వాహనం కూడా ఉంది. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement