
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ ఒంటరిగా వెళ్తుంటే.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీలో నిలుస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాలో అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. ఎన్నికల్లో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ ఢిల్లీ బాటపట్టారు. బీజేపీతో ఎలాగైనా పొత్తుపెట్టుకోవాలని బాబు, దత్తపుత్రుడు హస్తినలో మకాం వేశారు. ఇక, పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు. కాగా, పవన్ రెండు చోట్ల పోటీ చేస్తారని జనసేన నుంచి లీకులు మాత్రం బయటకు వస్తున్నాయి. అయితే, రెండు అసెంబ్లీ స్థానాలే కాకుండా ఒక అసెంబ్లీ నియోజకవర్గం, మరోచోట పార్లమెంట్ స్థానం నుంచి పవన్ పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదంతా బాగానే ఉన్నా.. రెండుచోట్ల పోటీ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే దానిపై పవన్ తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీచేయాలనే విషయంపై కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఎన్డీయే నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
చివరగా.. ఏ దిక్కు లేకపోతే ఢిల్లీనే దిక్కు కదా!. అంతకుముందు టీడీపీతో జనసేన పొత్తు సందర్బంగా ఎన్నో చీవాట్లు తిన్నానని చెప్పాడు. అన్ని చీవాట్లు తిన్నది ఎందుకనుకుంటున్నారు?. 24 సీట్లతో ఊరబొడిచేదేమీ లేదు. ఎన్ని గెలుస్తామో తెలియదు. అసలు అభ్యర్థులు ఎవరో చివరి దాకా స్పష్టత లేదు. ఇప్పుడు మిగిలిందొక్కటే కమల నాథుల కరుణ కటాక్షం. ఎంపీగా గట్టిగా ప్రయత్నిస్తే.. ఓడినా ఢిల్లీ వాళ్లే చూసుకుంటారు అనేది పవన్ ధీమా.