సాక్షి, హైదరాబాద్: ‘మీ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్‌కే ప్రాధాన్యం.. మీరెంత కష్టపడ్డా ఫలితం లేదు’... అంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ‘మీ పార్టీ మాదిరి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు’అంటూ బీఆర్‌ఎస్ సభ్యుడు మాజీ మంత్రి హరీశ్‌రావు ఒకరిపై ఒకరు చేసుకున్న రాజకీయ విమర్శలు బుధవారం శాసనసభలో దుమారం రేపాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా వాతావరణం కొద్ది సేపు వేడెక్కింది.
గత బీఆర్‌ఎస్ పాలనపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై సభ చర్చ చేపట్టింది. హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఇది శ్వేతపత్రం కాదు.. కోత పత్రమంటూ ఎద్దేవా చేశారు. ఈ దశలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ‘హరీశ్‌రావు ఎంత కష్టపడ్డా ఫలితం లేదు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉంటారు. మిమ్మల్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు’అని వ్యాఖ్యానించారు.
హరీశ్‌కు మేనమామ పోలికలు.. అందుకే అబద్ధాలు: రాజగోపాల్‌రెడ్డి
ఇదే క్రమంలో ‘ఆయనకు మేనమామ పోలికలు వ చ్చాయి. కేసీఆర్ చెప్పినట్టే అబద్ధాలు చెబుతున్నా రు’అని కోమటిరెడ్డి అనడంతో బీఆర్‌ఎస్ పక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ సభను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, బీఆర్‌ఎస్ సభ్యులు వెనక్కు తగ్గలేదు.
సభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ ‘ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ సభ్యులు ఎదురుదాడికి దిగడం సరికాదు... స్పీకర్‌ను బెదిరించడం ఏమిటి?’అని ఆక్షేపించారు. ‘పదేళ్లు విపక్షంలో కూర్చున్నాం... రెండు రోజులకే మీకు అసహనం వస్తే ఎలా’అంటూ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చె ప్పేందుకు హరీశ్‌రావుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు.
రూ. 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కునే ఖర్మ పట్టలేదు: హరీశ్
తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించిన హరీశ్‌రావు ‘పీసీసీ పదవిని రూ. 50 కోట్లకు కొనుక్కునే ఖర్మ మాకు పట్టలేదు. పదవి కొనుక్కున్నారనే మాట అన్నది కోమటి రెడ్డి బ్రదర్సే’అనడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ఇరుపక్షాల వాగ్వాదంతో సభ మరింత వేడేక్కింది.
హరీశ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు పట్టుబట్టారు. లేదంటే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే తాను విత్‌డ్రా చేసుకుంటానని హరీశ్‌రా వు అన్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుతున్న తరుణంలోనే హరీశ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
బావ.. బామ్మర్దుల గురించి చెప్పాలా?: మంత్రి కోమటిరెడ్డి
హరీశ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా పార్టీ ముందుకెళ్తోంది. మీకేం పనిలేదా? మీ పదేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పకుండా మాపై విమర్శలేంటి?’అంటూ మండిపడ్డారు. హరీశ్‌ను ఉద్దేశిస్తూ ’మీ బావ... బామ్మర్దులు ఎంత కొట్టుకున్నారో చెప్పాలా...?’అంటూ ప్రశ్నించారు. ఇన్నేళ్లు దోచుకున్న విషయాలు బయటికొస్తున్నాయనే భయంతో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment