టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యకు ఇప్పుడు పోటీ చేయడానికి సీటే లేకుండా పోయిందా? రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ సీట్లలో ఏదీ బుచ్చయ్యకు ఖాయం కాలేదా? ఈ రెండు సీట్లు ఎవరికి కేటాయించబోతున్నారు? సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని టీడీపీ అధ్యక్షుడు ఎందుకు పట్టించుకోవడంలేదు? ఇంతకీ బుచ్చయ్యకు సీటు ఉన్నట్టా? లేనట్టా?
తెలుగుదేశం పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి పోటీ చేసే స్థానం కోసం వెత్తుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా బుచ్చయ్య సిటింగ్ సీటు రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించాలని జనసేన నిర్ణయించుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన దుర్గేష్ ఓటమి పాలైనా, 40 వేలకు పైగా ఓట్లు సంపాదించుకున్నారు.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాపు సామాజికవర్గం కూడా దుర్గేష్ కు మద్దతుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే వ్యవహారం టీడీపీలో కలకలానికి కారణమవుతోంది. రాజమండ్రి రూరల్ తరపున తానే పోటీ చేస్తానని ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటున్న బుచ్చయ్య చౌదిరికి చంద్రబాబు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేదు. బుచ్చయ్య చౌదిరికి అడ్డాలాంటి కాతేరులో చంద్రబాబు సభ నిర్వహించినా, బుచ్చయ్య పేరును ప్రకటించలేదు. తర్వాత కూడా బుచ్చయ్యకు చంద్రబాబు నుంచి పోటీకి ఎటువంటి సిగ్నల్ రాలేదు. దీంతో పోటీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న బుచ్చయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన నేత కందుల దుర్గేష్ కు కేటాయించినందున..రాజమండ్రి సిటీలో పోటీ చేసేందుకు బుచ్చయ్య సిద్ధపడుతున్నట్టు సమాచారం. అయితే రాజమండ్రి సిటీలో పోటీ చేయడానికి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఎప్పుడో ఫిక్సయ్యారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం తనదేనంటూ ఆదిరెడ్డి వాసు గతంలో సభపెట్టి మరీ ప్రకటించారు.
ఇపుడు బుచ్చయ్య దృష్టి మళ్ళీ సిటీ నియోజకవర్గంపై పడటంతో ఆదిరెడ్డి వర్గంలో అలజడి రేగుతోంది. ఇప్పటికే ఆదిరెడ్డి, బుచ్చయ్య వర్గాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తాజా పరిణామాలతో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాజానగరం నుండి కూడా బుచ్చయ్య పోటే చేసే అవకాశం లేకుండా పోయింది. రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అటు రాజమండ్రి రూరల్ స్థానం కోల్పోయి, రాజానగరం దక్కక ఏం చేయాలో తెలియక బుచ్చయ్య వర్గం అయోమయంలో కూరుకుపోయింది.
తన స్వంత నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడి సభ ఏర్పాటు చేసినా, తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించుకోలేని స్థితి బుచ్చయ్య ఎదుర్కొన్నారు. గతంలో మండపేటలో సభ ఏర్పాటు చేసినపుడు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేవేగుళ్ల జోగేశ్వరరావు అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన చంద్రబాబు కాతేరు బహిరంగసభలో తన పేరు కూడా ప్రకటిస్తారని బుచ్చ్యయ్య ఎదురు చూశారు. అయితే చంద్రబాబు పొరపాటున కూడా బుచ్చయ్య పేరును ప్రకటించకపోవడంతో తమకు ఎక్కడి స్థానం దక్కుతుందో, అసలు పోటీ చేసే అవకాశం లభిస్తుందో లేదో తెలియక బుచ్చయ్య వర్గం మథనపడుతోంది.
రాజమండ్రి రూరల్ నుండి వరుసగా రెండు సార్లు విజయం సాధించినా, సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించినా, బుచ్చయ్యకు మాత్రం ఊరట లభించడం లేదు. త్యాగాలకు సిద్ధపడాలంటూ చంద్రబాబు ఇస్తున్న పిలుపునకు అర్ధం ఏమిటో, అది తమకే వర్తిస్తుందేమోనని బుచ్చయ్య అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: టీడీపీ చంద్రబాబు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
Comments
Please login to add a commentAdd a comment