హామీలు నెరవేర్చలేక అప్పులంటూ అబద్ధాలు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On Chandrababu and TDP Government | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చలేక అప్పులంటూ అబద్ధాలు: వైఎస్‌ జగన్‌

Published Sun, Aug 11 2024 4:46 AM | Last Updated on Sun, Aug 11 2024 7:44 AM

YS Jagan Fires On Chandrababu and TDP Government

‘ఎక్స్‌’ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ధ్వజం  

హామీలకు గ్యారంటీ నాదేనని ఎన్నికలప్పుడు పదేపదే చెప్పావ్‌ 

రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ ఇప్పుడు తప్పించుకునే యత్నం చేస్తున్నావ్‌ 

సూపర్‌ సిక్స్‌ సహా వాగ్దానాలన్నీ తు.చ. తప్పకుండా అమలు చేయాలి 

హత్యలు, విధ్వంసాలు, తప్పుడు లెక్కలు ఇకనైనా ఆపండి 

రాష్ట్రంలో దిగజారిన పాలనను గాడిలో పెట్టండి  

సాక్షి, అమరావతి: ‘ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాదీ అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయని.. అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ తన నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇది పచ్చి మోసం కాదా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘ఎన్నికలకు ముందు ముందు రాష్ట్రం శ్రీలంకలా అయిపోయిందని, ఆర్ధిక విధ్వంసం జరిగిందని ఊరూరా విష ప్రచారం చేశారు. అపార అనుభవం ఉంది, నన్ను మించినవారు లేరు, అమలు చేసే బాధ్యత నాదీ అని నమ్మబలికి సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ టెన్‌ అంటూ చాలా చాలా వాగ్దానాలు చేశారు. 

ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అంటున్నారు. అది కూడా అసత్యమే. సాక్షాత్తూ గవర్నర్‌గారితో అసెంబ్లీలో ఇలాంటి అనేక అవాస్తవాలను చెప్పించారు. ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలను ఆపేసి.. తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయకుండా సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలన్నీ తు.చ. తప్పకుండా అమలు చేయండి. ఇప్పటికే దిగజారిన పాలనను గాడిలో పెట్టండి’ అని హితవు పలికారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ శనివారం “ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ట్వీట్‌లో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

రాష్ట్రం అప్పు రూ.7.48 లక్షల కోట్లే.. 
నిజాలు ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ రుణాలు, విద్యుత్‌ కంపెనీల రుణాలు, గ్యారంటీ, నాన్‌ గ్యారంటీ రుణాలు అన్నీ కలిపి 2024 జూన్‌ నాటికి ఉన్న మొత్తం అప్పులు అక్షరాల రూ.7,48,612 కోట్లు. ఇందులో 2019లో మీరు (చంద్రబాబు) దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ.4,08,170 కోట్లు. దీనికిపైన ఉన్నవి మాత్రమే మా హయాంలో చేసిన అప్పులు. 

మీ హయాంలో అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 21.63 శాతం కాగా కోవిడ్‌ విపత్తుతో ఆర్థిక వ్యవస్థలో పెను సంక్షోభం వచ్చినా మా హయాంలో అది కేవలం 12.9 శాతమే ఉంది. ఈ వాస్తవాలన్నింటినీ గవర్నర్‌కు లేఖ రూపంలో తెలియజేశాం. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు, ఆర్బీఐ నివేదికలు, కాగ్‌ లెక్కలు లాంటి ఆధారాలతో కూడిన సమగ్ర వివరాలు bit.ly/4dkOKru లింక్‌లో ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబూ! 
 


తొలి క్షణం నుంచే ప్లేటు ఫిరాయింపు 
చంద్రబాబూ..! ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే మీరు ప్లేటు ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారు. అప్పులకు వడ్డీలు కట్టాలి..! అవి కట్టడానికే డబ్బుల్లేవు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే చెబుతూ ప్రజలను మాయచేసే ప్రయత్నం చేస్తున్నారు.   

రెండున్నర నెలల్లోనే ఇంత దగానా? 
తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వలేదు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు అందాల్సిన రూ.20 వేలు రాలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రెండు త్రైమాసికాల డబ్బులు పెండింగ్‌ పెట్టారు. వసతి దీవెనా లేదు. సున్నావడ్డీ లేనే లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకూ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేల జాడే లేదు. 

ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. రూ.20 వేలు చొప్పున ఇస్తానన్న మత్స్యకార భరోసా అడ్రస్సే లేదు. పేదలకు అత్యవసరమైన ఆరోగ్యశ్రీ చెల్లింపులు రూ.1,600 కోట్లు పెండింగ్‌ పెట్టారు. ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇచ్చే విధానం ఆగిపోయింది. ఇంటికి వచ్చే రేషన్‌ నిలిచిపోయింది. వలంటీర్లను మోసం చేశారు. విత్తనాల కోసం రైతులు మళ్లీ క్యూలో నిలబడే దుస్థితి తీసుకొచ్చారు. పంటలకు ఉచిత బీమా ఎగరగొట్టారు. 

స్కూళ్లలో టోఫెల్‌ క్లాసులు రద్దు చేశారు. ఇక విద్యా కానుక కిట్ల పంపిణీ అరకొరగానే. అది కూడా అంతా అస్తవ్యస్థం. మధ్యాహ్న భోజన పథకంలో రోజుకో మెనూ విధానం పోయింది. ఇంగ్లీషు మీడియం గాడి తప్పింది. పాఠశాలలు, గ్రామాల్లో పరిశుభ్రత పడకేసింది. శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. రెడ్‌బుక్‌ రాజ్యమేలుతోంది. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోంది. మహిళలకు రక్షణే లేదు. దిశ యాప్‌ అటకెక్కింది. రెండున్నర నెలల్లోనే ప్రజలను ఇంతలా దగా చేస్తారా చంద్రబాబూ? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement