న్యాయం, ధర్మం పాటించని వ్యక్తి అందుకే మెజార్టీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ
నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్
తన స్వార్థం కోసం బాబు ఏమైనా చెబుతాడు.. ఏదైనా చేస్తాడు.. అలాంటి దుర్మార్గ వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు
మనం చేయగలిగిందే చెప్పాం.. చేసి చూపించాం
మన బలం ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతే
బొత్సను గెలిపించి మన పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు సహకరించండి
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆ వ్యక్తికి ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ఆ స్థాయి వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం చూస్తూ ఉంటుంది కాబట్టి, మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి. కానీ చంద్రబాబునాయుడికి న్యాయం, ధర్మం ఏవీ లేవు. దురదృష్టవశాత్తు మనం ఈ దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నాం. తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు.. ఏదైనా చేస్తాడు.
అధికార, ధనబలంతో చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రతి పనీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సినది కాదు. నాయకుడు అనేవాడు ఇంత అధ్వానంగా ఉంటాడా.. అన్న స్థాయిలో ఆయన పని చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం.
కష్టకాలంలో తోడుగా నిలబడ్డ ప్రతికార్యకర్తకు కచ్చితమైన గుర్తింపు వస్తుంది. నేను కోరేది ఒక్కటే. ప్రజలకు మనం దగ్గరగా, తోడుగా ఉంటే వారే చంద్రబాబును నామరూపాల్లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ప్రజలే దండలు వేసి మనల్ని పిలిచే రోజు వస్తుంది.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ టీడీపీ పోటీ చేస్తోందంటే దానర్థం ప్రజా ప్రతినిధుల కొనుగోలుకు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విలువలు, విశ్వసనీయతే మన బలమని, మనమంతా కలిసికట్టుగా ఒక్కటిగా ఉండే పార్టీ మనదని అందరికీ తెలిసిందేనని చెప్పారు. న్యాయం, ధర్మం తెలియని చంద్రబాబు అనే దుర్మార్గుడితో మనం యుద్ధం చేస్తున్నామని తెలిపారు.
ఈ యుద్ధంలో మన అభ్యర్థి బొత్స సత్యనారాయణను మంచి మెజార్టీతో గెలిపించి, మన ప్రతిష్టను పెంపొందించేలా సహాయ సహకారాలు అందించాలని నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తొలుత నర్సిపట్నం.. ఆ తర్వాత పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
టీడీపీకి మెజార్టీ లేకున్నా పోటీ
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉంది. మన పార్టీ నుంచి 600కు పైగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఉంటే.. అదే టీడీపీ నుంచి గెలిచిన వారు 200కు పైబడి మాత్రమే ఉన్నారు. వాళ్లకు, మనకు మధ్య 387 స్థానాల తేడా ఉంది. అంత తేడా ఉన్నప్పుడు మామూలుగా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అక్కడ పార్టీ నుంచి అభ్యర్ధిని పెట్టకూడదు. కానీ, అక్కడ టీడీపీ పోటీ చేస్తోందంటే దానర్థం.. ప్రజా ప్రతినిధుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే.
నర్సీపట్నం నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు
అన్నీ మోసపూరిత హామీలు
గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. సూపర్ సిక్స్ అన్నాడు. ఇప్పుడు అవి కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నాడు. నీకు రూ.15 వేలు, నీకు రూ.18 వేలు అని ఇంటింటా ప్రచారం చేశాడు. ఇప్పుడు అవేవీ అమలు చేయకుండా మోసం చేస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబులా మనం కూడా హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు.
మన పార్టీ గెలుపు కోసమే వారు నాకు ఆ సలహాలిచ్చారు. కానీ, అబద్ధాలు చెప్పి గెల్చి, ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకుంటే ఏం సంతృప్తి ఉంటుంది? అమలుకు సాధ్యం కాకపోయినా హామీలు ఇస్తే గెలుస్తాం. ముఖ్యమంత్రి అవుతాం. కానీ ఆ తర్వాత కార్యకర్తలు మొదలు ఎమ్మెల్యేల వరకు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా? ‘జగన్ మాట ఇచ్చి, అమలు చేయలేదు’ అనే మాట అనిపించుకోకూడదు. మన పార్టీ పేరు చెబితే కార్యకర్తలు, నాయకులు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి.
దాని కోసమే నేను తాపత్రయపడ్డాను. అందుకే ఏనాడూ మోసపూరిత హామీలు ఇవ్వలేదు. 2014లో కూడా చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి, మాట తప్పాడు. రైతులు రుణాల మాఫీ, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాల మాఫీ, ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్ని రకరకాలుగా చెప్పాడు.
ఆ రోజుల్లో రుణమాఫీ చేద్దామని చెప్పాలంటూ నామీద కూడా ఒత్తిడి వచ్చింది. చేయలేనిది చెప్పలేమని చెప్పాను. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అన్ని రకాలుగా మోసం చేశాడని ప్రజలకు అర్ధం అయింది. అందుకే 2019లో ఆయన డిపాజిట్లు గల్లంతయ్యాయి.
పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు
ప్రజలే మనకు శ్రీరామరక్ష
2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నాం. మన పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పథకాన్ని ఏటా, క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశాం. అందుకే ఈ రోజు కూడా మనం ధైర్యంగా చెప్పగలం. ఏం చేశామో చెప్పుకోగలిగాం. రాజకీయాల్లో ఎవరైనా, ఎప్పుడైనా ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. కష్టకాలంలో మనం ఎలా ఉంటున్నామనేది ప్రజలు చూస్తారు. ఆ ప్రజలే మనకు శ్రీరామరక్షగా ఉంటారు.
విలువలు కోల్పోయిన రోజు మనకు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. రాజకీయల్లో విలువలు, విశ్వసనీయతతో మనం అడుగులేశాం. కష్టాలు లేకుండా ఏదీ ఉండదు. చీకటి వచ్చిన తర్వాత కచ్చితంగా వెలుగు రాక మానదు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా.. ఫలానా వాడు మన నాయకుడు అని చెప్పుకునే రీతిలో మనం ఉండాలి. అప్పుడు మనం కచ్చితంగా పై స్థానానికి ఎదుగుతాం.
అదే మన ప్రభుత్వం ఉండి ఉంటే..
జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా.. మమ్నల్ని బాగా చూసుకున్నాడు.. పలావు పెట్టాడు అంటారు. చంద్రబాబు గురించి అడిగితే.. బిర్యానీ పెడతానని మోసం చేశాడని అంటున్నారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది అన్న మాట ప్రతి ఇంట్లోనూ వినిపిస్తోంది. రెండు నెలలు తిరక్క మునుపే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇవాళ స్కూళ్లు, ఆస్పత్రులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు.
వ్యవసాయంలో రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాల కోసం క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆనాడు గడప వద్దకే మనం సేవలు అందిస్తే.. ఇప్పుడు టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. పాలన దెబ్బతింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారింది. చంద్రబాబు హామీలన్నీ అబద్ధాలు, మోసాలని తేలిపోతున్నాయి. అదే జగన్ సీఎంగా ఉండి ఉంటే ఈ పాటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, మత్స్యకార భరోసా అంది ఉండేవి. క్యాలెండర్ ప్రకారం అన్నీ ఈ పాటికే వచ్చేవి. ఈ తేడాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఏమిటీ చుక్కెదురు?
విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల గురించి ‘ఈనాడు’లో అదేదో ఘన కార్యం చేసినట్లు ‘వైఎస్సార్సీపీకి చుక్కెదురు’ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఏం చుక్కెదురు? చంద్రబాబుకు మెజార్టీ లేని చోట కొనుగోలు చేసి, స్టాండింగ్ కమిటీలో నువ్వు గెలిస్తే.. అదో ఘనకార్యం అన్నట్టు వైఎస్సార్‌సీపీకి చుక్కెదురా? చంద్రబాబు బ్రహ్మాండం అని రాస్తావు.. ఎందుకు? ప్రలోభాలు పెట్టినందుకా? పోలీసుల్ని పెట్టి, భయపెట్టి, దుర్వినియోగం చేసి కార్పొరేటర్ల ఓట్లు వేయించుకున్నందుకా? ఎందుకు బ్రహ్మాండం? ఇదా ఘన కార్యం? దొంగతనం, హత్యలు చేస్తే ఘనకార్యం అని రాసేట్టు ఉన్నారు. అదీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు పరిస్థితి. ఒక అబద్ధం చెప్పడం.. అదే అబద్ధాన్ని మళ్లీ, మళ్లీ పెద్దది చేసే చెత్త కార్యక్రమం. అన్యాయం చేస్తూ.. అదేదో ఘనకార్యం చేసినట్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నారు.
ధైర్యంగా నిలబడదాం
ప్రతి కార్యకర్తకు నేను ఒక్కటే చెబుతున్నాను. ఈ ఐదేళ్లు బాధలుంటాయి. నేను 16 నెలలు జైలుకు వెళ్లాను. ఆ స్థాయిలో వేధింపులు చూశాను. ప్రతి ఒక్కరికీ అదే చెబుతున్నా. తలెత్తుకుని మనం నిలబడగలిగినప్పుడు, పోరాటం చేయగలిగినప్పుడు రెట్టింపు స్థానంలోకి దేవుడు, ప్రజలు మనల్ని తీసుకువెళ్తారు. ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొండి.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో బొత్స సత్యనారాయణను మన అభ్యర్ధిగా ఎంపిక చేసేటప్పుడు.. మన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే అభ్యర్థులను అందరినీ అడిగాను. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పేరు చెప్పినా చెల్లుబాటవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా దీటైన అభ్యర్థిని పెట్టాలని చెప్పారు. అన్ని రకాలుగా ఆలోచించాకే బొత్స సత్యనారాయణను సరైన అభ్యర్ధిగా నిర్ణయించాం.
Comments
Please login to add a commentAdd a comment