ఒంగోలు టౌన్: జిల్లా కో ఆపరేటివ్ కార్యాలయంలో ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పోలిశెట్టి రాజశేఖర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కళ్లలో కారం చల్లి కర్రలతో కొట్టారు. తన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందే తన మీద దాడి చేయించారని ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని అంబేడ్కర్ భవనం సమీపంలోని ఇందిరా నగర్‌లో రాజశేఖర్ నివాసం ఉంటున్నారు. పెండింగ్ వర్క్ వుండటంతో ఆదివారం ఉదయం ప్రకాశం భవనంలోని రెండో అంతస్తులో ఉన్న కార్యాలయానికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. అంబేడ్కర్ భవనం రోడ్డులోని సచివాలయం వద్దకు రాగానే.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఎదురుగా వచ్చి అడ్డుకున్నాడు. కళ్లలో కారం కొట్టాడు. తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా మరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి రెండు చేతులను కదలకుండా పట్టుకున్నాడు. కర్రలతో ఇష్టమొచ్చినట్లు కొట్టడం మొదలుపెట్టారు. దెబ్బలు తాళలేక గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని వినాయకుడి మండపంలో ఉన్న జనం రావడంతో వదిలేసి పారిపోయారు. అంతలోనే అక్కడకు కార్యాలయం అటెండర్ షేక్ నవాజ్ రావడంతో అతడి సహాయంతో జీజీహెచ్‌లో రాజశేఖర్ చేరారు. తమ శాఖలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఇన్‌స్పెక్టర్ రామన్, జూనియర్ ఇన్‌స్పెక్టర్లు ఉదయకిరణ్, అశోక్‌కుమార్, అటెండర్ పి.స్వర్ణలు తన మీద ద్వేషంతో దాడి చేయించారని తనకు అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజశేఖర్ పేర్కొన్నారు. వన్‌టౌన్ సీఐ వై.నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్‌కు గాయాలు
కార్యాలయ సిబ్బందిపైనే అనుమానాలు
Comments
Please login to add a commentAdd a comment