కొలతల మేత.. అంతా రోత!
మార్కాపురం రూరల్: ప్రజా సేవకులుగా ఉన్న అధికారులు డబ్బు మత్తుకు బానిసలవుతున్నారు. పచ్చనోట్ల కోసం పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. మండలంలోని సచివాలయ సర్వేయర్ల చేతివాటం తారస్థాయికి వెళ్లింది. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి డబ్బులు అందితేనే పొలంలోకి కాలుపెడతామంటూ బహిరంగంగానే దందాలు చేస్తున్నారు. మార్కాపురం మండలంలోని పలు సచివాలయాల్లో సర్వేయర్ల దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు. రైతులు తమ పొలాల కొలతల కోసం గవర్నమెంటుకు చలానా కట్టుకున్నా కూడా లంచం అడుగుతున్నారు. రైతులు సర్వేయర్లకు ఫోన్లు చేస్తున్నా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తూ పనులు దాట వేస్తున్నారు. తమ పైఅధికారులు వేరే పనులు అప్పగించారని.. మీ పనులు చేయడానికి కుదరదంటూ తేల్చి చెప్పేస్తున్నారు. 15 రోజులు గడువు ముగిసే ముందు రైతులకు ఫోన్ చేసి ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నారు. వారి మాటలు నమ్మి రైతులు సంతకాలు పెడితే సర్వే చేసేసినట్లు ఆన్‌లైన్‌లో క్లోజ్ చేస్తూ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు. తరువాత దందాలు మొదలు పెడుతున్నారు. సచివాలయ సర్వేయర్లు ఈ బేరసారాలన్నీ వాట్సాప్ కాల్స్ ద్వారానే చేస్తున్నారు. మీరిచ్చే డబ్బులు మాకు మాత్రమే కాదయ్యా... మండల సర్వేయర్‌కు కూడా ఇవ్వాలని బాహాటంగానే చెబుతున్నారు. దీంతో చేసేదేమీలేక రైతులు వారు అడిగినంత డబ్బులిచ్చి పొలం సర్వే చేయించుకుని కొలతలు చేయించుకుంటున్నారు.
ఏసీబీ అధికారులకు సమాచారం
ఇటీవల కాలంలో మార్కాపురం మండలం అమ్మవారిపల్లి గ్రామస్తులు కూడా లంచం ఇచ్చి పని చేయించుకున్నారు. గజ్జలకొండ సచివాలయం– 2 పరిధిలోని రైతులు సర్వే చేయాలని అర్జీ ఇచ్చినప్పటికీ సర్వేయర్ స్పందించలేదు. మొన్నటివరకూ ఎన్నికల విధుల్లో ఉన్నానంటూ ఇప్పుడు అధికారులు తమకు వేరేపనులు అప్పజెప్పారని తప్పించుకు తిరుగుతున్నాడు. దరిమడుగు సచివాలయ సర్వేయర్ అయితే విస్తీర్ణం చొప్పున రైతుల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తిప్పాయిపాలెం, చింతగుంట్ల తదితర గ్రామాల్లోని సచివాలయంలో పనిచేసే సర్వేయర్లు కూడా ఇదే పంథాలో ఉన్నట్లు పలువురు రైతులు తెలిపారు. కొందరు సర్వేయర్లు రైతులకు ఫోన్‌చేసి తాముండేది కొన్నిరోజులు మాత్రమే అని.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు సంపాదించుకోవాలంటూ రైతులతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సర్వేయర్ల పనితీరుపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. అంతేకాక ఇప్పటికే కొందరు సర్వేయర్లపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం.
నిస్సిగ్గుగా సచివాలయ సర్వేయర్ల చేతివాటం వాట్సాప్ కాల్స్‌లోనే బేరసారాలు పచ్చ నోట్లు చేతిలో పెడితేనే భూముల సర్వే డబ్బు లేకుంటే ఆన్‌లైన్ క్లోజ్
ప్రతి పనికీ లంచం అడుగుతున్నారు
సచివాలయ సిబ్బందితో పాటు సర్వేయర్ కూడా ప్రతిపనికీ లంచం అడుగుతున్నారు. సమయానికి సచివాలయాలకు రాకుండా కాలయాపన చేస్తున్నారు. సచివాలయకు లేటుగా వచ్చి బయోమెట్రిక్ వేసి ఏదొక పనుందని చెబుతూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా వెళ్లిపోతున్నారు.
– నాథ గురుబ్రహ్మం, సర్పంచ్, రామచంద్రాపురం
సచివాలయం చుట్టూ తిరుగుతున్నా
సచివాలయంలో పనులకోసం వెళ్తే సిబ్బంది లేకపోవడంతో వెనుతిరిగి వెళ్తున్నాను. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రైతులు, పేదల కష్టాలు గుర్తించి సక్రమంగా ఉద్యోగాలు చేసుకోవాలి.
– అల్లూరయ్య, రైతు, అమ్మవారిపల్లి
Comments
Please login to add a commentAdd a comment