గొడ్డలితో దాడి.. తీవ్ర గాయాలు
అర్థవీడు(బేస్తవారిపేట): పాత కక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడి చేయడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాచవరం ఎస్సీ కాలనీలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..పాత కక్షల నేపథ్యంలో కటికల చంద్ర అనే వ్యక్తి బిక్షాల నాగయ్యపై గొడ్డలితో దాడి చేశాడు. నాగయ్య కంటి, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై బి. సుదర్శన్‌యాదవ్ తెలిపారు. చంద్రను అదుపులోకి తీసుకున్నారు.
కారుణ్య నియామకపత్రం అందజేత
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు శాఖలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు
నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన బి. సుబ్బారావు కుమారుడు క్రాంతి కుమార్‌కు మంగళవారం ఏఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు కారుణ్య నియామక పత్రం అందజేశారు. డీపీఓలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, వృత్తి నైపుణ్యం పెంపొందించుకొని అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడం ద్వారా మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ సులోచన, సూపరింటెండెంట్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతానికి కూలి మృతి
కంభం: విద్యుదాఘాతానికి కూలి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కంభంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. షేక్ ఖలీల్(32) గ్రానైట్, టైల్స్ పరిచేందుకు రోజు వారి కూలిగా వెళ్తుంటాడు. స్థానిక గర్‌ల్స్‌హైస్కూల్ సమీపంలోని ఓ గృహంలో మంగళవారం పనిచేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి
త్రిపురాంతకం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టూరిస్ట్ బస్ క్లీనర్ కిందకు జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే ఒరిస్సాలోని భువనేశ్వర్‌కు చెందిన భక్తులు దక్షిణ బారత యాత్రకు బయలుదేరారు. టూరిస్టు బస్సు వెల్లంపల్లి వద్దకు రాగానే డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో క్లీనర్ ఠాగూర్ కిందకు జారిపడ్డాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది వైద్యశాలకు తరలించే లోపే మృతి చెందాడు. ఎస్సై బసవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాదక ద్రవ్యాలతో జీవితం నాశనం
ఒంగోలు: మాదక ద్రవ్యాలతో జీవితం నాశనమవుతుందని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్విస్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లి బంగారం లాంటి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మానసికంగా యువత ధృఢంగా ఉండేలా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు అవసరమైన శిక్షణ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు అందిస్తుందన్నారు. యువత చైతన్యవంతులై మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆత్మహత్య ఆలోచనా ధోరణి మానసిక ఆరోగ్యానికి సంబంధించి తీవ్రమైన విషయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment