యోధుల త్యాగాలు చిరస్మరణీయం
● వీరనారి ఐలమ్మ, బషీర్‌బాగ్ అమరుడు రామకృష్ణ వర్ధంతి సభలో వక్తలు
ఒంగోలు టౌన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో పాల్గొని ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధులను చరిత్రను ఎప్పటికీ మరచిపోదని రజక వృత్తిదారుల సంఘ జిల్లా నాయకులు టంగుటూరి రాము అన్నారు. చిట్యాల ఐలమ్మ, విద్యుత్ ఉద్యమంలో అశువులు బాసిన రామకృష్ణ వర్ధంతి సభ మంగళవారం ఎల్బీజీ భవనంలో నిర్వహించారు. ఇద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెట్టి చాకిరి అమలవుతున్న రోజుల్లో వెనకబడిన రజక కుటుంబంలో పుట్టిన ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి 10 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిపెట్టిన పోరాటంలో ఐలమ్మ పాత్ర మరవలేనిదన్నారు. ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అనేక పోరాటాలు పురుడుపోసుకున్నాయన్నారు. 2000లో నాటి చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలతో ప్రజలు అల్లాడిపోయారని, ప్రజలు పెద్ద ఎత్తును తరలివచ్చి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో చేపట్టిన ఉద్యమకారులపై చంద్రబాబు ప్రభుత్వం చేయించిన పోలీసు కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి, సత్తెనపల్లి రామకృష్ణ అమరులయ్యారని తెలిపారు. ఉద్యమం జరిగి 24 ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ ధరలు పెంచడానికి నేటికీ ప్రభుత్వాలు భయపడుతున్నాయని, అలాంటి పోరాటాలు చేస్తేనే ప్రభుత్వాలు దిగి వస్తాయని చెప్పారు. జిల్లా రజక వృత్తిదారుల సంఘం నాయకుడు తోటా తిరుపతిరావు మాట్లాడుతూ ఐలమ్మ, రామకృష్ణ లాంటి పోరాట యోధుల అడుగుజాడల్లో నడవాలని, నేటి తరానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆవులమంద రమణమ్మ, సీహెచ్ కోటేశ్వరరావు, చిట్యాల కొండయ్య, మంచికలపాటి శ్రీనివాసరావు, పోలయ్య, వేములపాటి మల్లికార్జునరావు, పొదిలి మల్లికార్జున, కల్లగుంట శ్రీనివాసరావు, సంజీవయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment