విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే సహించం
ఒంగోలు టౌన్: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న యోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచనకు వ్యతిరేకంగా మంగళవారం నగరంలోని సాగర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని సెయిల్‌లో విలీనం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గంటుపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దురుద్దేశంతోనే విశాఖ ఉక్కుకు గనులను కేటాయించకుండా కేంద్రం కుయుక్తులు పన్నుతుందని ఆరోపించారు. గత 6 నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని విమర్శించారు. ధర్నాలో ప్రజాసంఘాల నాయకులు లలిత కుమారి, కల్పన, ఆదిలక్ష్మి, పమిడి వెంకటరావు, షేక్ మాబు, ఎంఏ సాలార్, సర్దార్, ఆర్ మోహన్, నాగరాజు, శేఖర్, దామా శ్రీనివాసులు, బంకా సుబ్బారావు, టి మహేష్, వీరారెడ్డి, జయంతిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment