తెల్ల బంగారం
మెరిసిపోతున్న
సింగరాయకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీ పరిధిలో జోరుగా ఉప్పు సాగవుతోంది. సుమారు 4 వేల ఎకరాల్లో దీనిని సాగుచేస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం తప్ప మిగిలిన కాలాల్లో 9 నెలల పాటు సాగు చేస్తారు. మామూలుగా ఎకరాకు 75 కేజీల బస్తా సుమారు రూ.800 నుంచి రూ.900 వరకు తయారవుతుంది. ఈ ఏడాది వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో సుమారు 1300 నుంచి 1400 బస్తాల వరకు ఉత్పత్తి వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకారం ప్రతినెలా సుమారు 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది. ఉప్పు తయారీ బాగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 7 వేల మందికి పైగా ఉప్పు రైతులు, సుమారు 10 వేల మందికి పైగా కూలీలు ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. గత ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో ఉప్పు రైతులు ధరల్లేక అవస్థలు పడ్డారు. ఉప్పు సాగుచేసే కొటారులు వదల్లేక, అలాగని సాగు చేసి నష్టాలు భరించలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో సాగు నిలిపేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.
రైతుల కళ్లల్లో ఆనందం..
ఉమ్మడి జిల్లాలో ఉప్పు ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. గత సంవత్సరం ఇదే సీజన్‌లో ఉప్పు ఽ75 కేజీల బస్తా ధర కేవలం రూ.200 పలికింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఉప్పు తయారీ ప్రారంభమైంది. సీజన్ ప్రారంభంలో 75 కేజీల బస్తా ధర రూ.150. దీంతో గత ఏడాదిని గుర్తుకు తెచ్చుకుని రైతులు ఆందోళనకు గురయ్యారు. అయితే ధరలు క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. తొలుత రూ.150 ఉన్న ధర రూ.200లకు పెరిగింది. ప్రస్తుతం రూ.300 వస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఉప్పు నాణ్యమైనదిగా ఉండడంతో మంచిరేట్లు పలుకుతున్నాయి. 2015 నుంచి 2019 వరకూ ఉప్పు రైతులకు అన్నీ కష్టాలే. కనీస గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టాల్లో కూరుకుపోయారు. దీనికి తోడు వ్యాపారులు సిండికేట్ కావడంతో రైతులు కుదేలైపోయారు. 75 కేజీల బస్తా ధర 2015, 16 సంవత్సరాల్లో రూ.60 పలికింది. 2017లో రూ.90, 2018లో రూ.100, 2019లో రూ.120 ఇలా క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. 2020 తర్వాత రైతుల పరిస్థితి మారిపోయింది. ఉప్పు ధరలు సైతం అమాంతం పెరిగిపోయాయి. 75 కేజీల బస్తా ధర రూ.200 నుంచి రూ.225కి పెరిగింది. నాలుగేళ్లుగా ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గత ఏడాది సీజన్‌లో రూ.265 పలికినా తర్వాత ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
పెరుగుతున్న ఉప్పు ధరలు ఆనందంలో రైతులు 75 కేజీల బస్తా ధర రూ.300 ఉమ్మడి జిల్లాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో సాగు వాతావరణ మార్పులతోఆగిన ఉప్పు తయారీ
దళారీలను అరికట్టాలి
ఉప్పు వ్యాపారంలో దళారులు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. వీరు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి ఉప్పు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో దళారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఫలితంగా పూర్తి స్థాయి లాభాలు ఆర్జించలేకపోతున్నామని ఉప్పు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు వ్యాపారంలో దళారీ వ్యవస్థను రూపుమాపాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం మండలం నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఉప్పు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ఉప్పు రైతులకు అండగా నిలిస్తే ఉప్పు ఉత్పత్తి ద్వారా అధిక లాభాలు ఆర్జిస్తామని ఉప్పు రైతులు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment