మంత్రి శాసించారు.. | - | Sakshi
Sakshi News home page

మంత్రి శాసించారు..

Published Wed, Sep 11 2024 2:20 AM | Last Updated on Wed, Sep 11 2024 2:32 AM

మంత్రి శాసించారు..

మంత్రి శాసించారు..

కలెక్టర్‌ ఆదేశించారు..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇసుక దందాపై కలెక్టర్‌ కన్నెర్ర చేశారు.. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ను పంపారు. ఇసుక ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి పోలీసులకు అప్పజెప్పారు. సాయంత్రానికి మంత్రి ఫోన్‌ చేశారు. పోలీసులు ట్రాక్టర్‌ను వదిలేశారు. ఈ ఘటన జరుగుమల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జరుగుమల్లి మండలం చింతలపాలెం ఇసుక రీచ్‌ నుంచి వారం రోజులుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. జిల్లా పోలీస్‌ అధికారులు స్పందించడంతో రెండు రోజులు విరామం ఇచ్చారు. వినాయక చవితి పండుగ ముగిసిన మరుసటి రోజు నుంచి తిరిగి రావాణా కొనసాగించారు. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సొంత గ్రామమైన నాయుడుపాలేనికి మంగళవారం ఉదయం 6 గంటల నుంచే అక్రమ రవాణా ప్రారంభమైంది. నాయుడుపాలెంలో సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఇసుక కావాలని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఇచ్చిన లేఖపై ఉదయం నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తున్నారు.. వాస్తవానికి ఇంజినీరింగ్‌ అధికారికి ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చే అధికారం లేదు. అనుమతి ఇచ్చే అధికారం మైనింగ్‌ శాఖ అధికారులకే ఉంది. ఈ అక్రమ రవాణాపై మండల అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో గ్రామస్తులు జేసీ, ఒంగోలు ఆర్‌డీఓకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో చివరికి మంగళవారం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా కు ఫోన్‌ చేసి అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ ఫొటోలు పంపారు. వెంటనే ఆమె స్పందించి బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ను పంపి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. దీంతో బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ జరుగుమల్లి వస్తుండగా మున్నంగి సీ ఫుడ్స్‌కు వెళ్లే అడ్డరోడ్డు వద్దకు రాగానే టంగుటూరు వైపు 1809 నంబర్‌ ట్రాక్టర్‌ వెళుతోంది. ట్రాక్టర్‌ను ఆపి ఇసుక అనుమతికి కాగితాలు చూపించాలని అడిగారు. దీంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ తన వద్ద ఉన్న పంచాయతీరాజ్‌ అధికారి లెటరు చూపించగా ‘ఇది అనుమతి పత్రం కాదని నాలుక గీక్కోడానికి కూడా పనికిరాదు’ అంటూ ట్రాక్టర్‌ను సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో జరుగుమల్లి పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు అప్పగించి వెళ్లిపోయారు. తరువాత ఆరు గంటలకు ట్రాక్టర్‌ను పోలీసులు వదిలిపెట్టడంతో వెంటనే గ్రామస్తులు విషయాన్ని కలెక్టర్‌కు తెలిపారు. తరువాత బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ గ్రామస్తులకు ఫోన్‌ చేసి ఈ ఒక్క బండి గురించి వదిలేయండి. మంత్రి స్వామి తన గ్రామంలో సిమెంట్‌ రోడ్లకు ఇసుక తోలుతున్నారని చెప్పారని అందుకు వదిలిపెట్టానని, కలెక్టర్‌ తనను ఇసుక అక్రమ రవాణాపై నియమించారని, రేపటి నుంచి గ్రామంలో ఉండి అక్రమ రవాణాను అడ్డుకుంటానని తెలిపారని గ్రామస్తులు వివరించారు. ఈ విధంగా అక్రమ రవాణాను అడ్డుకోవాలని కలెక్టర్‌ ఆదేశిస్తే మంత్రి స్వామి అక్రమ రవాణాకు సహకరించడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సిమెంట్‌ రోడ్లకు వెళుతున్న ట్రాక్టర్లు నాయుడుపాలేనికి పోకుండా టంగుటూరు, జమ్ములపాలెం తదితర ప్రాంతాలకు వెళుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క నాయకుల ఒత్తిడి, మరో పక్క ఉన్నతాధికారుల ఆదేశాలతో నలిగిపోతున్నామని మండల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సెబ్‌ అధికారులు మా శాఖను ఎకై ్సజ్‌లో విలీనం చేస్తున్నారు మాకు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం లేదని చెబుతుండడం కొసమెరుపు.

ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు కలెక్టర్‌ ఆదేశాలతో ట్రాక్టర్‌ను సీజ్‌ చేసిన బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇసుక ట్రాక్టర్‌ పోలీసులకు అప్పగింత మంత్రి డోలా ఆదేశాలతో ట్రాక్టర్‌ను వదిలేసిన జరుగుమల్లి పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement