ప్రయాగ్‌రాజ్–బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రయాగ్‌రాజ్–బెంగళూరు మధ్య ప్రత్యేక వారంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 13 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రతి ఆదివారం ప్రయాగ్‌రాజ్–బెంగళూరు ప్రత్యేక రైలు (04131) నడుస్తుంది. అదే విధంగా ఈ నెల 16 నుంచి అక్టోబర్ 20 వరకు ప్రతి బుధవారం బెంగళూరు–ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక రైలు (04132) నడుస్తుంది.
ఆన్‌లైన్ డిగ్రీ అడ్మిషన్స్
తుది నోటిఫికేషన్ విడుదల
ఒంగోలు: దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళశాల (స్వయం ప్రతిపత్తి)లో ఆన్‌లైన్ డిగ్రీ అడ్మిషన్స్ మూడవ, తుది నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కళ్యాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్స్ దరఖాస్తు చేసుకోవడానికి నేడు చివరి తేదీ అన్నారు. ఈనెల 11 నుంచి 13 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు సంబంధించి తమ కాలేజీ సహాయ కేంద్రం కూడా పనిచేస్తుందని చెప్పారు. డిగ్రీలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఫోన్ 9490474225 నంబర్‌ను సంప్రదించవచ్చు. విద్యార్థులు తప్పనిసరిగా బుధవారంలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అనంతరం వెబ్ ఆప్షన్లకు ఈనెల 11 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు పెట్టుకోవాలని, వెబ్ ఆప్షన్ మార్పులకు ఈనెల 16 వ తేదీ ఏమైనా తప్పులుంటే సహాయ కేంద్రానికి వచ్చి సరి చేసుకోవాల్సిందిగా తెలిపారు.
15లోగా ఓపెన్ స్కూల్ దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ విద్యనభ్యసించేందుకు ఆసక్తిగలవారు ఈనెల 15లోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ ఓపెన్ స్కూల్ జిల్లా చైర్మన్ డి.సుభద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 వరకు రూ.200 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ఓపెన్ స్కూళ్ల స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు గమనించి విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు గత ఏడాదికంటే ఈ ఏడాది అదనంగా కనీసం 10 శాతం అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ–చలానాలు రద్దు చేయాలని 17న ధర్నా
ఒంగోలు టౌన్: ఈ–చలానాలు రద్దు చేయాలని, పర్మినెంట్ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 13వ తేదీ మండల కేంద్రాల్లో, 17వ తేదీ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని ఏఐఆర్‌టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ఒంగోలు నగర ఆటో యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలు నగరంలో 10 పర్మినెంట్ ఆటో స్టాండులు ఏర్పాటు చేయాలని తంబి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జరిగే ధర్నాల్లో ఆటో కార్మికులు పాల్గొనాలని కోరారు.
సంక్షేమ, విద్యా సహాయకుల బదిలీలు
ఒంగోలు సెంట్రల్: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా సంక్షేమ, విద్యా సహాయకుల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. డ్వామా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జీఎస్‌డబ్ల్యూఎస్ నోడల్ అఫీసర్ ఉషా రాణి, ప్రకాశం, బాపట్ల జిల్లా ఎస్సీ సంక్షేమాధికారులు ఎన్ లక్ష్మా నాయక్, జే రాజదిబోరా పాల్గొని బదిలీ ప్రక్రియకు పాటించాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. 312 మంది దరఖాస్తు చేసుకోగా 274 మంది హాజరైనట్లు ఎస్సీ జిల్లా సంక్షేమాధికారి లక్ష్మా నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment