జీజీహెచ్‌లో రోగిలా నటిస్తూ చోరీ
ఒంగోలు టౌన్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చోరీ జరిగింది. చికిత్స కోసం వచ్చిన రోగి పర్సును తస్కరించాడో దొంగ. మద్దిపాడు మండలం కీర్తిపాడు గ్రామానికి చెందిన మేడా తిరుమల ఒంటరి మహిళ. పొగాకు గ్రేడింగ్ పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు ఇద్దరు సంతానం. కూతురు కోటేశ్వరి, కుమారుడు కోటేశ్వరరావు ఉన్నారు. వారిద్దరికి వారం రోజులుగా జ్వరం వస్తుండడంతో చికిత్స కోసం నాలుగు రోజుల క్రితం వారిని తీసుకొని జీజీహెచ్‌కు వచ్చింది. రోగ నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులు డెంగీ జ్వరం అని నిర్ధారించి మూడో అంతస్తులోని జనరల్ వార్డులో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ఎందుకై నా మంచిదని కూలి పనులకు వెళ్లగా వచ్చిన డబ్బులతో పాటుగా బ్యాంకులో పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బులు మొత్తం రూ.25 వేలు తెచ్చి పర్సులో దాచిపెట్టుకుంది. సోమవారం రాత్రిపర్సును తలకింద పెట్టుకొని నిద్రపోయింది. తెలవారుజామున లేచి చూస్తే పర్సు కనిపించలేదు. వార్డు మొత్తం వెదికినా కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె ఔట్‌పోస్టులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న ఒన్‌టౌన్ సీఐ వై.నాగరాజు ఆస్పత్రిని సందర్శించి సీసీ కెమెరాలు పరిశీలించారు. అర్ధరాత్రి పక్క బెడ్డు మీద ఉన్న ఒంగోలుకు చెందిన ముస్తఫా పర్సును తీసుకెళ్లడం సీసీ ఫుటేజిలో గమనించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముస్తఫా ఆరు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఒంగోలు చిరునామాతో అతడు ఆస్పత్రిలో చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో ఉన్న కొందరు రోగులతో కనిగిరికి చెందిన వాడిగా అతడు పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. రోగిలా నటిస్తూ ఆస్పత్రిలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జీజీహెచ్‌లో తరచుగా దొంగతనాలు...
జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజన ఆస్పత్రికి ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతి రోజు కనీసం 700 నుంచి వెయ్యి మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. వీరిలో 150 కేసులు అత్యవసరమైనవి కాగా మరో 100 కేసులకు పైగా అడ్మిషన్లు జరుగుతుంటాయి. రోగులు, వారి కుటుంబ సభ్యులతో ఆస్పత్రి లోపల, బయట ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది. ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో అర్థం కానీ పరిస్థితి ఉంటుంది. ఇక్కడ తరచుగా పేషంట్ల వద్ద నుంచి డబ్బులు దొంగతనాలకు గురవుతున్నాయి. అనేక మంది రోగులు వార్డులో ఉన్నప్పుడో, ఆస్పత్రిలోకి వచ్చి పోయే సమయంలోనో తన డబ్బులు పోయినట్లు తరచుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇక ప్రతిరోజూ కనీసం 15కు పైగా సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి, ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు రక్షణ లేకుండా పోయిందని ఇటీవల ఆందోళన చేసిన జూడాలు ఆరోపించడం తెలిసిందే. పోలీసు పెట్రోలింగ్ పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఈ చోరీతో తెలిసిపోతుంది. ఇప్పటికై నా జీజీహెచ్ వద్ద భద్రత పెంచాలని, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఏదైనా పెద్ద సంఘటన జరిగేంత వరకు వేచి చూసే ధోరణి మంచిది కాదని పలువురు విమర్శిస్తున్నారు.
నిద్రలో ఉన్న రోగి తల్లి పర్సు చోరీ రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారని కన్నీరు పెట్టుకున్న బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment