వర్చువల్ మీటింగ్ కోసం ఎదురుచూస్తున్నాం
● మార్కాపురం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అడిషనల్ డైరెక్టర్ రాజమన్నార్
మార్కాపురం: మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది జూలై 18న న్యూఢిల్లీలోని జాతీయ వైద్యమండలి వారికి అప్పీల్ కోసం ప్రతిపాదనలు పంపామని, వారు చేసే వర్చువల్ మీటింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అడిషనల్ డైరెక్టర్ ఎస్.రాజమన్నార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాక్షిలో ‘మెడి’కలే‘నా’ వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ 24న జాతీయ వైద్య కౌన్సిల్ వారు మార్కాపురం మెడికల్ కళాశాలను పర్యవేక్షించారన్నారు. అదే నెల 28వ తేదీ వర్చువల్ హియరింగ్ జరిగిందని ఆ హియరింగ్‌లో మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాలలకు లెటర్ ఆఫ్ పర్మిషన్ లేదని చెప్పారన్నారు. ఎల్‌ఓపీ ఇవ్వకపోవడానికి పలు కారణాలు తెలిపారన్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు, లేడీస్, జంట్స్ హాస్టల్ భవనాలు పూర్తికాకపోవడం, సీనియర్ రెసిడెన్సీ భవనాలు, కళాశాల ఇతర భవనాలు పూర్తికాకుండా నిర్మాణ దశలో ఉండటం, అధ్యాపక బృందం 41.2 శాతంగా ఉండటం, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ బృందం సరిపడా లేకుండా 78.8 శాతంగా ఉండటం, హాస్టల్స్‌లో సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, బెడ్ ఆక్యుపెన్సీ 35 శాతంగా ఉండటం వలన ఎల్‌ఓపీ ఇవ్వలేదని తెలిపారని అన్నారు. అయితే మళ్లీ తాను ఈ ఏడాది జూలై 18న న్యూఢిల్లీలోని జాతీయ వైద్యమండలికి తిరిగి పర్యవేక్షణ కోసం అప్పీల్ చేశామని, వర్చువల్ పర్యవేక్షణ తేదీ కోసం ఎదురుచూస్తున్నామని రాజమన్నార్ తెలిపారు.
ఇరువర్గాల ఆమోదంతో
కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి
ఒంగోలు టౌన్: ఇరు వర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారానికి కక్షిదారులందరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి అన్నారు. సెప్టెంబర్ 14 వ తేదీ దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని, కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రాజీ అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారపు చెల్లింపు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, అన్ని రకాల సివిల్ కేసులు ఇద్దరి ఆమోదంతో పరిష్కరిస్తారని, ఈ అవకాశాన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల్లో ఉన్నవారు ఉపయోగించుకొని వ్యాజ్యాలను పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్ లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమ తీర్పు అని పేర్కొన్నారు. కోర్టుల్లో చెల్లించిన ఫీజును కూడా తిరిగి పొందవచ్చని తెలిపారు. ప్రీ సిట్టింగ్ రూపంలో ఇరు వర్గాల ఆమోదంతో ముందస్తుగా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment