నిర్దేశించిన రుణాలు మంజూరు చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: బ్యాంకర్లు ప్రభుత్వం నిర్దేశించిన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఆ మేరకు జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. మంగళవారం ప్రకాశం భవనంలో డీసీసీ (డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ) సమావేశం నిర్వహించారు. జిల్లాలో బ్యాంకులు నిర్దేశించిన పలు రకాల రుణాల లక్ష్యాలు సాధించిన ప్రగతి పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023–24 ఆర్ధిక సంవత్సరానికి 2024 మార్చి 31వ తేదీ నాటికి జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.17,988 కోట్లకు రూ.30,975.15 కోట్ల రుణాలు మంజూరు చేసి 172 శాతం ఆర్ధిక ప్రగతిని సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.20,591.18 కోట్లుగా నిర్ణయించారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలకు సంబంధించి ఖరీఫ్‌లో రూ.3900.40 కోట్ల లక్ష్యానికి 2024 జూన్ 30వ తేదీ నాటికి రూ.2,368.97 కోట్ల రుణాలను అందచేసి 60.73 శాతం ఆర్థిక ప్రగతిని సాధించినట్లు వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 32,657 స్వయం సహాయక సంఘాలకు రూ.1671.3 కోట్ల రుణాల లక్ష్యం ఉంటే జూన్ 30 నాటికి 7982 సంఘాలకు రూ.616.19 కోట్లు మంజూరు చేసి 24.44 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. మెప్మా ద్వారా ఈ ఆర్థిక సంవత్సంరలో 430 స్వయం సహాయక సంఘాలకు రూ.5555.65 కోట్లు మంజూరు చేశారన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ శ్రీలత, లీడ్ బ్యాంకు మేనేజర్ రమేష్, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు వసుంధర, రవికుమార్, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ జేడీలు శ్రీనివాసులు, బేబిరాణి, జనార్ధన్ రెడ్డి, ఉద్యానవన అధికారి గోపిచంద్, హౌసింగ్ పీడీ శ్రీనివాసప్రసాద్, ఏపీఎంఐపీ పీడీ రమణ, డీటీడబ్ల్యూ జన్నాథరావు, చేనేత ఏడీ ఉదయ్‌కుమార్ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment