బాలలంతా స్వేచ్ఛగా ఎదగాలి
ఒంగోలు అర్బన్: ప్రతి బిడ్డ మంచి వాతావరణంలో పెరిగి వారి కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులు, సమాజం కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న బంగారు బాలోత్సవాలను గురువారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా బాలలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలల స్వేచ్ఛకు ప్రతీకగా చిన్నారులచే బెలూన్లను గాలిలోకి ఎగురవేయించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రజలతో బాలల హక్కులను పరిరక్షిస్తామని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తమవంతు బాధ్యతగా పనిచేస్తామని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మికులు లేని, బాల్య వివాహ రహిత, అక్షర చైతన్య, ఆరోగ్య ప్రదమైన ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 18 ఏళ్లలోపు బాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బంగారు బాల్యం కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. సంతోషం, ఆరోగ్యం, సురక్షితమైన బాల్యాన్ని బాలలకు అందించేందుకు వివిధ శాఖల అధికారులతో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను నియమించామన్నారు. బంగారు బాల్యం కార్యక్రమంపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యామ్‌బాబు, నగర మేయర్ సుజాత, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వి.రామాంజనేయులు, డీఆర్‌ఓ ఓబులేసు, ఐసీడీఎస్ పీడీ మాధురి, బంగారు బాల్యం నోడల్ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డీఈఓ కిరణ్‌కుమార్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఎంహెచ్‌ఓ సురేష్, డీఆర్‌డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ రవికుమార్, బీసీ సంక్షేమ అధికారి అంజల, మైనార్టీ సంక్షేమ అధికారి నారాయణ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, డీసీపీఓ దినేష్‌కుమార్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సునీల్, బాబూరావు, కోటేశ్వరరావు, అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు.
కలలను సాకారం చేసుకునే అవకాశం వారికి కల్పించాలి బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి చిన్నతనంలోనే లక్ష్యాలు నిర్దేశించుకునేలా చూడాలి బంగారు బాలోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment