No Headline
మార్కాపురం: జిల్లాలో మార్కాపురం డివిజన్‌లో పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. పశ్చిమ ప్రకాశంలో ఈ ఏడాది సుమారు 8,840 హెక్టార్లలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. మార్కాపురం డివిజన్‌లోని 12 మండలాలతోపాటు కందుకూరు డివిజన్‌లోని తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల, దర్శి, మర్రిపూడి, కనిగిరి ప్రాంతాల్లో పత్తి తీత ప్రారంభించారు. జూన్, జూలైలో సాగు చేసిన పత్తి దిగుబడి వస్తుండగా, కొద్దిగా ఆలస్యంగా సాగు చేసిన పత్తి మరో రెండు మూడు రోజుల్లో తీతకు రానుంది.
సర్కారు నిర్లక్ష్యం దళారులకు వరం
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు మార్కాపురంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం దళారులకు వరంగా మారింది. రైతులు తాము పండించిన పత్తిని దళారులు చెప్పిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళారులు క్వింటా పత్తికి రూ.5500 నుంచి రూ.6 వేలు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది మధ్యస్థ రకం పత్తి మద్దతు ధర 7020గా ఉండగా క్వింటా పత్తిని రైతులు రూ.12 వేల వరకు అమ్ముకున్నారు. గత నెలలోనూ క్వింటా రూ.8 వేల వరకు పలికిన పత్తి ధర.. సరిగ్గా దిగుబడి చేతికొచ్చే సమయంలో నేల చూపులు చూడటం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ 30న మార్కాపురం మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. క్వింటా పత్తి కనీస మద్దతు ధర 7020 ప్రకటించడంతో రైతులు యార్డుకు తెచ్చి పత్తిని అమ్మారు. ఈ సీజనన్‌లో కూడా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటవుతుందని రైతులు ఆశించగా, ఇంత వరకు కొనుగోలు కేంద్రాన్ని మార్కాపురంలో ప్రారంభించలేదు.
పెట్టుబడి చేతికొచ్చేనా?
క్వింటా పత్తికి రూ.9 వేలు దక్కితేనే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశిస్తున్నా ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. రోజూ పశ్చిమ ప్రకాశం నుంచి సుమారు 10 నుంచి 15 లారీల పత్తి గుంటూరు మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. కొంత మంది రైతులు గ్రూపుగా ఏర్పడి లారీలను బాడుగకు మాట్లాడుకుని ఒక్కో లారీలో 150 క్వింటాళ్ల పత్తిని గుంటూరు చేరుస్తున్నారు. ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి వ్యయప్రయాసలకోర్చి పండించిన పత్తికి గిట్టుబాటు ధర దక్కకపోతుండటంతో పెట్టుబడి కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
త్వరలో ప్రారంభిస్తాం
సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కాపురం మార్కెట్ యార్డులో ప్రారంభించాలని ఉన్నతాధికారులను కోరాం. త్వరలోనే కేంద్రం ప్రారంభం కానుంది. రైతులు పండించిన పత్తిని ఇక్కడే అమ్ముకోవచ్చు.
– కోటేశ్వరరావు, కార్యదర్శి, మార్కాపురం మార్కెట్ యార్డు
Comments
Please login to add a commentAdd a comment