అగ్రగామిగా ఉండటం సంతోషం
ఫిషరీస్ రంగంలో
● ఏకేయూ వీసీ డి.వి.ఆర్.మూర్తి
ఒంగోలు సిటీ: ఫిషరీస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవడం సంతోషకరమని ఏకేయూ వైస్ ఛాన్సలర్ డి.వి.ఆర్.మూర్తి అన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఏకేయూ ఆక్వాకల్చర్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ బి.హరిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీసీ మూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యవసాయ రంగంతో పాటు చేపల పెంపకం, రొయ్యల పెంపకం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున గుజరాత్ కంటే మన రాష్ట్రం ఆక్వాసాగులో అధికంగా ఉందన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు మాట్లాడుతూ ఆక్వాసాగు అధికంగా సాగు చేయడానికి ప్రధాన కారణం కోస్తా తీర ప్రాంతం వాతావరణం దృష్ట్యా మంచి వసతులు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఆక్వాకల్చర్ డిపార్టుమెంట్ ను బాగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆక్వా కల్చర్ డిపార్టుమెంట్ ద్వారా జాతీయ స్థాయిలో సెమినార్లు నిర్వహించి అధ్యాపకులకు, విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. వీసీ మూర్తి, రిజిస్ట్రార్ బి.హరిబాబు దేవి సీపుడ్స్ ఫుడ్ డివిజన్ మేనేజరు అన్సారితో పాటు పలువురిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహనరావు, ఆక్వాకల్చర్ డిపార్ట్‌మెంట్ అధ్యాపకులు డాక్టర్ బి.సురేష్, డాక్టర్ అశ్వర్ధనారాయణ, మార్కెటింగ్ విభాగం మేనేజరు ఎం.నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment